రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా? – రీసెర్చ్​లో ఆసక్తికర విషయాలు!

www.mannamweb.com


How Many Liters Water Should You Drink Per Day : శరీరానికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చాలా మందికి రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలియదు. ఇంకొందరు తాగినా.. ఎక్కువ తాగడమో, తక్కువ తాగడమో చేస్తుంటారు. అయితే, అలా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని లీటర్ల నీరు(Water) తాగాలి? తక్కువ తాగితే ఏమవుతుంది? ఎక్కువ తాగితే ఏం జరుగుతుంది? వీటన్నింటికి సమాధానం నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం.

సాధారణ వ్యక్తి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 7 నుంచి 10 గ్లాసుల నీళ్లు.. అంటే 2-3 లీటర్ల నీటిని తాగాలని అమెరికా పరిశోధకులు అధ్యయన పూర్వకంగా కనుగొన్నారు. అయితే, ఎండలో, వేడి ప్రదేశాల్లో పనిచేసేవారు, ఎక్కువ శారీరక శ్రమ చేస్తున్నవారు.. ఈ మోతాదును కొంత మేర పెంచుకోవచ్చంటున్నారు. అంతేకానీ.. డైలీ తీసుకునే వాటర్ మొత్తంగా తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదని వెల్లడించారు. ఎందుకంటే ఆ విధంగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.

అమెరికాలోని “నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌”కు చెందిన పరిశోధకులు.. రోజూ తగినంత వాటర్ తాగడం వల్ల దీర్ఘాయుష్షును సొంతం చేసుకోవచ్చనే దానిపై ఈ రీసెర్చ్ చేపట్టారు. దాదాపు 30 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ పరిశోధనలో 11,255 మంది పాల్గొన్నారు. 30-45 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వారి ఆరోగ్య వివరాలు తీసుకొన్నారు. ఆపై.. వారికి ’70-90 ఏళ్ల’ వయసుకు వచ్చాక మరోసారి పరిశీలించి.. ఆ వివరాలన్నింటినీ “ఇ బయోమెడిసిన్‌” వైద్య పత్రికలో ప్రచురితం చేశారు. ఆ నివేదికలో వెలుగులోకి వచ్చిన వివరాలతో పాటు ఆరోగ్యకర జీవనానికి తాగునీటి ఆవశ్యకతకు సంబంధించిన పలు అంశాలను ‘కిమ్స్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అకడమిక్స్‌’ డైరెక్టర్‌ డాక్టర్‌ మణిమాలరావు ఈ విధంగా వివరించారు. అవేంటంటే..

‘వాటర్​ వెయిట్’ సమస్య ఉంటే ఏమవుతుంది? దీన్ని తగ్గించడం ఎలా?

దాహమేసిన వెంటనే తాగాలి : నీరు ఎక్కువ తాగినా అవేమీ శరీరంలో నిల్వ ఉండవు. బయటకు వెళ్లిపోతాయి. పైగా ఆ వాటర్​ను వడబోయడానికి కిడ్నీలు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి.. ఈ సమస్య లేకుండా ఎప్పుడు దాహమేస్తే అప్పుడు మంచినీరు తాగడాన్ని అలవాటు చేసుకోవడం మంచిది అంటున్నారు డాక్టర్ మణిమాలరావు. కనీసం దాహమేసిన 15 నిమిషాల్లోపు తాగేలా చూసుకోవాలంటున్నారు.

అలాగే.. రోజువారీ నీటిని ఒకేసారి తాగడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే.. ఒకేసారి తాగితే బాడీ ఎక్కువ నీరుందని భావించి బయటకు పంపించేస్తుందని చెబుతున్నారు. అలాగని మరీ కొంచెం తాగితే.. ఆ నీళ్లను దాచిపెడుతుందట. కాబట్టి ఇవి రెండూ మంచిది కాదని సూచిస్తున్నారు.
వయసు పెరుగుతున్న కొద్దీ కూడా మంచినీటిని ఎక్కువగా తాగాల్సిన అవసరం ఉండదంటున్నారు. ఉదాహరణకు 65-70 ఏళ్లు దాటిన వారు అధికంగా నీరు తాగితే.. వారి కిడ్నీలపై త్వరగా దుష్ప్రభావం పడే అవకాశం ఉంటుందంటున్నారు మణిమాలరావు.
తక్కువ తాగితే ఏమవుతుందంటే? మీరు నీరు తక్కువగా తాగితే ముఖ్యంగా డీహైడ్రేషన్‌కు లోనయ్యే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్ మణిమాలరావు. అలాగే.. కిడ్నీల పనితీరు మందగిస్తుందని, రక్తపోటు పడిపోతుందని, కండరాలు పట్టేస్తాయని ఆమె సూచిస్తున్నారు. అదే విధంగా.. తలనొప్పి, మలబద్ధకం, చర్మం-నోరు ఎండిపోవడం, నిస్సత్తువ వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు. ముఖ్యంగా యూరిన్ పసుపు పచ్చ రంగులోకి వచ్చిందంటే.. ఒంట్లో నీటి శాతం తగ్గిందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి టైమ్​లో వెంటనే తగినంత వాటర్ తాగాలని సూచిస్తున్నారు.

మరీ ఎక్కువ తాగితే ఏమవుతుందంటే? వాటర్ మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా.. శరీరంలో ఎక్కువగా నీరు చేరడం వల్ల అన్ని అవయవాల్లోని కణాల్లో నీటి శాతం ఎక్కువవుతుందంటున్నారు. ఫలితంగా కణాల బయట ఉండాల్సిన సోడియం.. కణాల లోపలకు చేరుతుందని సూచిస్తున్నారు. దాంతో తల తిరగడం, తలనొప్పి, అయోమయం, రక్తపోటు పెరగడం, గుండె లయ తప్పడం వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు. అంతేకాదు.. కిడ్నీలపై భారం పెరిగి మూత్రపిండాల వైఫల్యానికి దారి తీసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.