చలి కాలంలో కొబ్బరి నూనె ఎందుకు గడ్డ కడుతుందో తెలుసా?

 శీతాకాలంలో ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కాలంలో సాధారణంగా కొబ్బరి నూనె గడ్డకడుతుంది. బాటిల్‌లో నూనె తీసుకోవడానికి ప్రయత్నించే అది గడ్డ కట్టి కనిపిస్తుంది. ఇలా శీతాకాలంలో కొబ్బరి నూనె ఎందుకు గడ్డకడుతుందో తెలుసా? మరేఇతర నూనెలు గడ్డ కట్టవు..

శీతాకాలంలో కొబ్బరి నూనె జుట్టుకు వినియోగించినా అది ఘనీభవిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ నూనెలో 90 శాతం వరకు సంతృప్త కొవ్వు ఉంటుంది. ఈ కొవ్వు పరమాణు నిర్మాణం సరళ రేఖలో ఉంటుంది. చల్లని వాతావరణం కారణంగా సరళ రేఖలోని అణువులు దగ్గరకు వస్తాయి. తరువాత వాటి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. దీంతో నూనె ద్రవం నుంచి ఘనపదార్థంగా మారి ఘనీభవిస్తుంది. మరో ప్రధాన ప్రభావం ఏమిటంటే.. కొబ్బరి నూనె ఇతర నూనెల కంటే ఎక్కువ ఘనీభవన స్థానం కలిగి ఉంటుంది. కొబ్బరి నూనె సాధారణంగా 24 నుండి 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఘనీభవన స్థానం కలిగి ఉంటుంది. దీనివల్ల కొబ్బరి నూనె బాటిల్ త్వరగా ఘనీభవిస్తుంది. దీంతో నూనె బయటకు రాకుండా గడ్డ కట్టుతుంది.


శీతాకాలంలో కొబ్బరి నూనెను త్వరగా వాడటానికి ఇరుకైన సన్నని బాటిల్‌కు బదులుగా వెడల్పుగా ఉండే బాటిల్‌ను ఉపయోగించడం మంచిది. ఇరుకైన చిన్న బాటిల్‌లో కొబ్బరి నూనెను తీయడం చాలా కష్టంగా ఉంటుంది. కావాలంటే బాటిల్‌ను వేడి నీరు లేదా గ్యాస్ మంట వద్ద కొంచెం దూరంగా పట్టుకుంటే నూనె కరిగిపోతుంది. అలాగే కొబ్బరి నూనెలో నువ్వుల నూనె లేదా బాదం నూనె కాస్త పోసి ఉపయోగించవచ్చు. ఈ నూనెలను చాలా తక్కువ మొత్తంలో బాటిల్‌లో పోస్తే, కొబ్బరి నూనె త్వరగా గడ్డకట్టదు. కొబ్బరి నూనె బాటిల్‌ను గాలి చొరబడని పెట్టెలో ఉంచినా అది గడ్డకట్టదు. బయట ఉంచితే చలి కారణంగా అది త్వరగా ఘనీభవిస్తుంది. బదులుగా కొబ్బరి నూనె బాటిల్‌ను మూసి ఉన్న బాక్స్‌లో ఉంచితే నూనె త్వరగా ఘనీభవించకుండా ద్రవంలా ఉంటుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.