చెరకు రసమే కాదు ఆ ఫ్రూట్ జ్యూస్‌లు కూడా తాగకండి – కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ICMR

ICMR New Guidelines: దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది ఉపశమనం కోసం జ్యూస్లు, కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. చెరుకు రసం సహా పలు రకాల పండ్ల రసాలు తాగుతున్నారు.


ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. చరకు సహా ఎక్కువ చక్కెర కలిగి ఉండే జ్యూస్లు, కూల్ డ్రింక్స్ వినియోగం తగ్గించాలని వెల్లడించారు.

ఈ మేరకు ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సహకారంతో ఆరోగ్యకర ఆహారపు అలవాట్లను ప్రోత్సహించేందుకు 17 కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

చెరకు రసం తక్కువగా తీసుకోండి

చెరకు రసంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం పట్ల వీలైనంత తక్కువగా తీసుకోవాని ICMR తెలిపింది. అంతే కాదు, ఆరోగ్యానికి హాని కలిగించే కూల్ డ్రింక్స్, చక్కెర యాడ్ చేసిన పండ్ల రసాలు, టీ, కాఫీలకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది. పండ్లతో పాటు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను సిఫార్సు చేసింది. సమతుల ఆహారం, మెరుగైన ఆహారపు అలవాట్లతో కూడిని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

చెరకు రసం గురించి ప్రత్యేక ప్రస్తావన

ICMR తాజా మార్గదర్శకాల్లో చెరకు రసం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. 100 మిల్లీ లీటర్ల చెరకు రసంలో 13 – 15 గ్రాముల చక్కెర ఉంటుందని తెలిపింది. “దేశంలో ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా వినియోగించే చెరకు రసంలో చక్కెర అధికంగా ఉంటుంది. వీలైనంత వరకు వినియోగాన్ని తగ్గించాలి” అని ICMR వెల్లడించింది. పెద్దలు ప్రతిరోజూ 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను తినకూడదని వైద్యులు వెల్లడిస్తున్నారు. 7 నుండి 10 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు రోజుకు 24 గ్రాములకు పరిమితం చేయాలని సూచిస్తున్నారు. చెరకు రసంలో ఉండే పోలికోననాల్ నిద్రలేమి సహా పలు సమస్యలకు కారణం అవుతుందన్నారు.

పండ్ల రసాలను తగ్గించి పండ్లు తినండి

చక్కెర కలిపిన పండ్ల రసాలను తీసుకోవద్దని ICMR సూచించింది. పండ్ల రసాలకు బదులుగా తాజా పండ్లు తీసుకోవాలని వెల్లడించింది. పండ్లలోని ఫైబర్, పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపింది.

కూల్ డ్రింగ్స్ అస్సలు తీసుకోకండి

శీతల పానీయాలు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయని ICMR తెలిపింది. చక్కెర, ఆర్టిఫీషియల్ స్వీటెనర్లతో పాటు చక్కెర కలిపిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపింది. “కూల్ డ్రింక్స్ అనేవి నీళ్లు, తాజా పండ్లకు ప్రత్యామ్నాయం కాదు. వాటిని వీలైనంత వరకు వాటిని తీసుకోకపోవడం మంచిది” అని ICMR వెల్లడించింది. మజ్జిగ, నిమ్మరసం, పండ్లు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఉత్తమం అని తెలిపింది.

టీ, కాఫీలతో ఆరోగ్యానికి చాలా ముప్పు

అధిక కెఫీన్ కంటెంట్ ఉన్న టీ, కాఫీని వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలని ICMR సూచించింది. 150ml కప్ బ్రూ కాఫీలో 80 నుండి 120 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుందని తెలిపింది. టీలో 30 నుండి 65 మిల్లీ గ్రాముల వరకు ఉంటుందని వెల్లడించింది. రోజువారీ కెఫిన్ 300 మిల్లీ గ్రాములకు మించి ఉండకూడదని వెల్లడించింది.

టీ, కాఫీలోని టానిన్లు, ఐరన్ శోషణను నిరోధిస్తాయని ICMR తెలిపింది. దీంతో ఐరన్ లోపం, రక్తహీనతకు దారితీసే అవకాశం ఉందని వెల్లడించింది. భోజనానికి ముందు, తర్వాత కనీసం ఒక గంట వరకు టీ, కాఫీని తీసుకోవద్దని ICMR సూచించింది. అధికంగా కాఫీ తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

చక్కెర కలిపిన డ్రింక్స్ ను మానేసి, వాటి స్థానంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం, సీ ఫుడ్స్ లాంటి సమతుల ఆహారం తీసుకోవాలని ICMR వెల్లడించింది.

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నూనె, చక్కెర, ఉప్పు వినియోగాన్ని పరిమితం చేయాలని ICMR మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.