కేవైసీ కోసం కస్టమర్లను వేధించొద్దు

ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా బ్యాంక్‌లకు కీలక సూచన చేశారు. నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ/నీ కస్టమర్‌ గురించి తెలుసుకో) డాక్యుమెంట్ల కోసం కస్టమర్లకు అదేపనిగా తరచూ కాల్‌ చేస్తూ వేదించొద్దన్నారు. ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ వార్షిక సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. ఏదేనీ ఆర్థిక నియంత్రణ సంస్థ పరిధిలో ఒక కస్టమర్‌ ఒక చోట (బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ తదితర) సమర్పించిన కేవైసీ డాక్యుమెంట్లను.. ఇతర సంస్థలు సైతం పొందడానికి అవకాశం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.


కస్టమర్‌ ఒకసారి ఒక ఆర్థిక సంస్థకు పత్రాలను సమర్పించినట్టయితే, అవే పత్రాలను మళ్లీ, మళ్లీ సమర్పించాలంటూ కోరకుండా చూడాలన్నారు. తరచూ కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంకులు కోరుతుండడం పట్ల సోషల్‌ మీడియాపై చాలా మంది నిరసన వ్యక్తం చేస్తుండడంతో, ఆర్‌బీఐ గవర్నర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కస్టమర్ల ఫిర్యాదుల సంఖ్యను బ్యాంకులు తగ్గించి చూపించరాదని, అలా చేయడం నిబంధనలను ఉల్లంఘించినట్టు అవుతుందని బ్యాంకులను ఆర్‌బీఐ గవర్నర్‌ హెచ్చరించారు. బ్యాంకులు తమ సేవలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారానికి బ్యాంక్‌ మేనేజర్ల నుంచి మేనేజింగ్‌ డైరెక్టర్ల వరకు సమయం కేటాయించాలన్నారు.