ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పొదిలిలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. ఈరోజు ( డిసెంబర్ 5, 2025 ) తెల్లవారుజామున 3.14 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అకస్మాత్తుగా భూమి కొన్ని సెకన్లు కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే కొద్దిసేపటికే భూకంపనాలు ఆగడంతో పొదిలివాసులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. అంతే కాకుండా ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. భూకంప తీవ్రత, కారణాలు తెలియజేయడానికి భౌగోళిక నిపుణులకు సమాచారం పంపినట్టు తెలుస్తోంది. అవసరమైతే ప్రాంతాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు సర్వే చేయాలని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది. స్థానికులు ఎటువంటి పుకార్లను నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
మే 6న కూడా ఇదే ప్రాంతంలో భూకంపం..
కాగా పొదిలిలో భూకంపం రావడం ఇది మొదటిసారి కాదు. గత మే 6న ఉదయం 9.54 గంటలకు కూడా ఇదే ప్రాంతంలో స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. ఆ సమయంలో కూడా భూమి దాదాపు ఐదు సెకన్ల పాటు కంపించినట్లు స్థానికులు గుర్తు చేసుకున్నారు. కొత్తూరు బ్యాంకు కాలనీ, రాజు ఆసుపత్రి వీధి, ఇస్లాంపేట వంటి ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ రోజు కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
ఇక సుమారు ఏడు నెలల వ్యవధిలోనే రెండు సార్లు భూకంప అనుభవం రావడంతో పొదిలి ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వరుస భూప్రకంపనలు రావడానికి కారణాలు ఏమిటో తెలియక ప్రజలు మరింత అయోమయానికి గురవుతున్నారు. ఈ ప్రాంతంలో భూకంపాలకు దారితీసే భూగర్భ మార్పులు జరుగుతున్నాయా? లేకపోతే భూగర్భ జలాల మార్పుల కారణమా? అనే దానిపై నిపుణుల నుండి క్లారిటీ రావాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజలకు సూచనలు..
భూకంపాలు వచ్చినప్పుడు ఇళ్లలో పెద్ద అల్మారాలు, నీళ్లు నిండిన డ్రములు, ఫ్రిజ్ వంటి వస్తువులకు దూరంగా ఉండాలి
బయటకు వచ్చే మార్గాలు అడ్డం లేకుండా చూసుకోవాలి
భూకంప సమయంలో లిఫ్ట్‌లు ఉపయోగించకూడదు
పిల్లలు, వృద్ధులను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లాలి

































