APలో పింఛను పంపిణీ లో సౌలభ్యం

ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద ప్రతి నెలా ఒకటో తేదీన జరుగుతోన్న సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తెల్లవారుజామునే పంపిణీ చేయాలని ఎక్కడా నిబంధనలు ప్రభుత్వం పెట్టకున్నా…చాలా జిల్లాల్లో అధికారుల ఒత్తిడి మేరకు 4, 5 గంటల నుంచి ప్రారంభిస్తున్నారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతోపాటు లబ్ధిదారులు కూడా ఇబ్బందులుపడుతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఉదయం 7 గంటలకు పంపిణీ ప్రారంభించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఆ సమయానికి మాత్రమే యాప్‌ పనిచేసేలా మార్పులు చేసింది. ఇదేకాకుండా లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే ఏ కారణంతో అలా చేయాల్సి వచ్చిందో వెంటనే నమోదు చేసేలా మార్పులు చేశారు. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు, ఉపాధి హామీ పని ప్రదేశంలో, బంధువుల ఇళ్ల వద్ద పింఛను పంపిణీ చేసినా నమోదుకు అవకాశం కల్పించింది. మరోవైపు ప్రభుత్వ సందేశాన్ని లబ్ధిదారులకు తెలిపేందుకు 20 సెకన్ల ఆడియోని యాప్‌లో ప్లే చేయనున్నారు. లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన వెంటనే ఇది ఆటోమెటిక్‌గా ప్లేకానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో దీన్ని మార్చి 1వ తేదీన చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పైలెట్‌గా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.