P4 Model : ఏపీలో ఉగాది పండగ రోజున పీ 4 (public private people partnership) విధానం ప్రారంభించనుంది చంద్రబాబు ప్రభుత్వం. ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం పీ 4 విధానాన్ని రూపొందించినట్లు చంద్రబాబు సర్కార్ తెలిపింది.
ముందుగా 4 గ్రామాల్లో పీ 4 విధానం పైలట్ ప్రాజెక్ట్ ను అమలు చేస్తారు.
పి 4పై అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఉగాది నుంచి P4 విధానం అమలు చేస్తామని ఆయన చెప్పారు. పేదల సాధాకారితకు, వారిని ఆర్థికంగా బలోపేతంగా చేసేందుకు దీన్ని చేపడుతున్నామని వివరించారు. సమాజంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉండటమే పీ 4 ముఖ్య ఉద్దేశ్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
పీ 4 కోసం నిర్మాణాత్మకమైన స్థిరమైన విధానం ఉండాలని అధికారులతో చెప్పారు. అర్హత ఉన్న కుటుంబాలను డేటా బేస్, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామ సభ ద్వారా గుర్తించాలన్నారు. 16 జిల్లాల్లో 76 లక్షల కుటుంబాలపై సర్వే చేస్తున్నామన్నారు చంద్రబాబు.
ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్.. బిల్డింగ్ ఓనర్స్ దగ్గర మస్ట్‌గా ఇది తీసుకోవాలి..
”గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్ కమ్ ట్యాక్స్ పేయర్లు, ఫోర్ వీలర్ ఉన్న వారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వాళ్ళు అనర్హులు. మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్న వారు, ఆర్థికంగా ఉన్న కుటుంబాలకు పీ4 నుండి మినహాయింపు. ఇప్పటికే అందుతున్న పథకాలకు అదనంగా పీ4 ద్వారా పేదలకు సాయం అందుతుందని” ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ఈ మధ్య నీతి ఆయోగ్ లో పీ4 పై చంద్రబాబు మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలోని అట్టడుగు 20శాతం మందిని ఉద్ధరించడానికి అగ్రశ్రేణి 10శాతం సంపన్న వ్యక్తులు సహకరించేలా చూడటం ద్వారా ఆర్థిక అంతరాన్ని తగ్గించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు. ఈ నమూనా సుస్థిర అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన వెల్లడించారు. దీన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని, తద్వారా పేదరిక నిర్మూలన వేగంగా జరుగుతుందని చంద్రబాబు వివరించారు.
ఏపీలో తాము ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. స్వల్పకాలంలో పేదరికాన్ని తగ్గించడం, మధ్య కాలంలో నిరంతర సాధికారత సాధించడం, ఉన్నవారు లేనివారి మధ్య అంతరాన్ని గణనీయంగా తగ్గించడమే దీర్ఘకాలిక లక్ష్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.
అభివృద్ధి చర్యల ఏకైక లక్ష్యం ఉపాధి కల్పన అని చంద్రబాబు చెప్పారు. ఇది మన జాతీయ ప్రాధాన్యతగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలి అనేదానికి బదులు, ఎంత ఉపాధిని సృష్టిస్తారు అనేది మనం అడగాలి అని చంద్రబాబు అన్నారు. పుష్కలంగా ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా, ప్రపంచ శ్రామికశక్తికి అత్యంత ముఖ్యమైన వనరుగా మనం ఉద్భవించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అంతిమంగా దేశం బలం దాని ప్రజలే అని చంద్రబాబు స్పష్టం చేశారు.