తెలంగాణ కేబినెట్ భేటీకి EC గ్రీన్ సిగ్నల్.. వాళ్లు పాల్గొనడానికి వీళ్లేదని షరతు

తెలంగాణ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమావేశానికి కొన్ని షరతులు విధిస్తూ అనుమతి ఇచ్చింది. కేవలం అత్యవసర విషయాలనే కేబినెట్‌లో చర్చించాలని కండిషన్ పెట్టింది.


ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేబినెట్‌ భేటీలో పాల్గొనకూడదు అని సూచించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీని వాయిదా వేయాలని పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం శనివారమే కేబినెట్ భేటీ నిర్వహించాలనుకున్న విషయం తెలిసిందే. ఈసీ అనుమతి కోసం చివరి వరకు వెయిట్ చేసి.. వాయిదా వేశారు. దీంతో అనుమతి ఎప్పుడు లభిస్తే అప్పుడే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. మరోవైపు సోమవారం వరకూ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తామని, అప్పటికీ రాకపోతే ముఖ్యమంత్రి సహా మంత్రివర్గమంతా ఢిల్లీ వెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిసి రిక్వెస్టు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో సడన్‌గా ఈసీ పర్మిషన్ ఇవ్వడంతో కాస్త ఊరట లభించినట్లైంది.

మరోవైపు రైతు రుణమాఫీ, ప్రస్తుత ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలపై ఈ భేటీలో చర్చించేలా ఎజెండా సిద్ధమైంది. ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో అత్యవసరమైన అంశాలపైనే చర్చ జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం జూన్ 2న ఉన్నందున వేడుకల నిర్వహణపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.