దేశంలో రవాణా రంగంలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం దేశ పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. ఈ క్రమంలోనే కాలుష్య నివారణకు పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని తీసుకువచ్చి, ఈ బస్సులను కేటాయిస్తూ కాలుష్య రహిత దేశంగా మార్చే పనిలో ఉంది.
ఇందులో భాగంగా తెలంగాణా రాష్ట్రానికి భారీగా ఈ బస్సులను కేటాయిస్తోంది.
తెలంగాణాకు మరో 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
ఇప్పటికే అనేక దఫాలుగా రాష్ట్రానికి చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందిస్తుండగా, తాజాగా మరోమారు 2 వేల ఈ బస్సులను రాష్ట్రానికి కేటాయించింది. తెలంగాణా రవాణా రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన క్రమంలో తెలంగాణా ఆర్టీసీ సేవలను ఈ బస్సులతో విస్తరించనుంది. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడం, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచటం లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయి.
వివిధ వర్గాలుగా విభజించి అందుబాటులోకి
ఆర్టీసీ యాజమాన్యం ఈ 2000 బస్సులను వివిధ రకాలుగా వర్గీకరించింది. ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, లో-ఫ్లోర్, సెమీ లో-ఫ్లోర్, స్టాండర్డ్ ఏసీ, మినీ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు సులభంగా ఎక్కడానికి వీలుగా ‘లో-ఫ్లోర్’ బస్సులకు ప్రాధాన్యతనిస్తున్నారు. తయారీ సంస్థలు ఈ బస్సులను దశలవారీగా సరఫరా చేయనున్నాయి.
హైదరాబాద్ వాసుల ప్రయాణ కష్టాలకు చెక్
బస్సు రకాన్ని బట్టి కిలోమీటరుకు కనిష్ఠంగా రూ.54.91 నుండి గరిష్ఠంగా రూ.66.90 వరకు అద్దెను ఖరారు చేసినట్లు సమాచారం. ఇది ప్రభుత్వానికి, ప్రయాణికులకు సమర్థవంతమైన రవాణా పరిష్కారాలను అందిస్తుంది. ఇక పెద్ద సంఖ్యలో ఈ బస్సులు అందుబాటులోకి వస్తున్న క్రమంలో హైదరాబాద్ లో ప్రయాణికుల రవాణా సమస్యలు పరిష్కారం కానున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీ వంటి అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ప్రయాణం ఇప్పుడు మరింత సులభతరం కానుంది.
పాతబస్తీ వాసులకు మినీ ఎలెక్ట్రిక్ బస్సులు
ఇక్కడి ఇరుకైన రహదారుల కోసం ఆర్టీసీ తొలిసారిగా ఎలక్ట్రిక్ మినీ బస్సులను ప్రవేశపెడుతోంది. ఈ మినీ బస్సులు గల్లీల్లో కూడా సులభంగా తిరుగుతాయి కాబట్టి పాతబస్తీ నివాసితుల రవాణా కష్టాలను ఈ బస్సులు తగ్గిస్తాయి. అంతేకాకుండా, చౌటుప్పల్-దిల్‌సుఖ్‌నగర్ వంటి కీలక మార్గాల్లో పొరుగు జిల్లాల ప్రయాణికుల కోసం స్టాండర్డ్ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయి.
కాలుష్య రహిత ప్రయాణం కోసం ఈ బస్సులు
మెట్రో ప్రయాణికులకు ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ని మెరుగుపరిచేందుకు ఈ బస్సులను ఫీడర్ సర్వీసులుగా ఉపయోగించాలని భావిస్తున్నారు. మెట్రో స్టేషన్ల నుండి తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ మినీ బస్సులు ఎంతో ఉపకరిస్తాయి. డీజిల్ బస్సులను తొలగించి, వీటిని ప్రవేశపెట్టడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది.ఈ బస్సులు రద్దీని తగ్గించి, సుఖమయమైన, కాలుష్య రహిత ప్రయాణాన్ని అందిస్తాయి.



































