ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఎప్పుడు విడుదల చేస్తారో తెలుసా?

Exit Polls Explained: భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు అంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలకు ప్రతిరూపం అని చెప్పవచ్చు. మనదేశంలో ఎన్నికలు చాలాదేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.


ఇప్పుడు రెండునెలలుగా ఎన్నికల హంగామా దేశంలో నడుస్తోంది. ఏ దేశాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తో వస్తున్నారు. ఇప్పటివరకూ ఆరు దశల పోలింగ్ పూర్తయింది. ఇక జూన్ 1న ఏడోదశ పోలింగ్ తో ఎన్నికల క్రతువు ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆరోజు ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతాయి. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై అందరూ టెన్షన్ తో ఎదురుచూస్తున్నారు. అయితే, దానికంటే ముందుగా అంటే జూన్ 1 వ తేదీన చివరిదశ పోలింగ్ పూర్తి అయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి అవుతాయి. అసలు ఫలితాల కంటే ముందుగా వచ్చే ఈ రిజల్ట్స్ పై కూడా అందరూ ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే, కొంతవరకూ ఓటింగ్ పల్స్ తెలుస్తుందని చాలామంది నమ్ముతారు. అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? వీటిని ఎవరు ఎందుకు నిర్వహిస్తారు? ఎందుకు వీటిని చివరి దశ పోలింగ్ తరువాత మాత్రమే వెల్లడిస్తారు? అసలు ఫలితాలకు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు.. మధ్యలో వ్యత్యాసం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు అర్ధం చేసుకుందాం.

ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?
Exit Polls Explained: ఓటు వేయడానికి వెళ్లిన ఓటరు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే.. అతను ఏపార్టీకి ఓటు వేశాడు? ఎందుకు వేశాడు? వంటి విషయాలను తెలుసుకుని.. ఆ అభిప్రాయాల్ని క్రోడీకరించి.. ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి అనే అంచనా వేయడమే ఎగ్జిట్ పోల్స్. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ దాదాపుగా ఎన్నికల నిర్వహణ అంత క్లిష్టంగానే ఉంటుంది. ఓటర్లను ఎంపిక చేసుకోవడం.. వారి నుంచి ప్రశ్నలకు సమాధానం రాబట్టడం.. వాటిని శాస్త్రీయంగా విశ్లేషించడం.. వాటిని వెల్లడి చేసాయడం ఇంత ప్రాసెస్ ఉంటుంది.

ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు?
Exit Polls Explained: చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తాయి. ఒక్కో సంస్థ ఒక్కో మార్గంలో దీనిని నిర్వహిస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చాలా కీలకమైనది సాంపిల్ ఎంపిక. ఉదాహరణకు ఒకరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనుకుందాం. అప్పుడు అక్కడ ఉన్న నియోజకవర్గాలు.. వాటిలో కీలక నియోజకవర్గాలు వీటి నుంచి ఎగ్జిట్ పోల్స్ కోసం సాంపిల్స్ ఎంచుకుంటారు. అది కూడా మహిళలు, పురుషులు, వయసు, ఆర్థిక స్థితిగతులు ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ పై ఆధారపడి శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. ఎన్నిలలో ఓటింగ్ కు సంబంధించి కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకుని వాటిపై ఓటు వేసి బయటకు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. కొన్ని సంస్థలు నమూనా బ్యాలెట్ నిర్వహిస్తాయి. అంటే, బ్యాలెట్ పేపర్ లాంటిది ఇచ్చి వారు ఏ గుర్తుపై ఓటు వేశారో అదే గుర్తుపై ఓటు వేయమని కోరతాయి. ఈ సాంపిల్స్ ఒక్కో నియోజకవర్గంలోనూ వందల సంఖ్యలో తీసుకుంటారు.. వేర్వేరు పోలింగ్ స్టేషన్స్ నుంచి వీటిని కలెక్ట్ చేస్తారు. ఇలా సేకరించిన సాంపిల్స్ మదింపు చేసి ఏ పార్టీకి లేదా ఏ అభ్యర్ధికి ఎంత శాతం ఓట్లు రావచ్చు అనే ఒక అంచనా వేస్తారు. ఆ అంచనాల ఆధారంగా ఫలితాలు సిద్ధం చేస్తారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎందుకు చివరి దశ వరకూ ప్రకటించరు?
Exit Polls Explained: నిర్ణీత సమయానికి ముందే ఎగ్జిట్ పోల్‌లను ప్రచురించడం ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని నిబంధన ప్రకారం ఉల్లంఘనగా ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. అలాంటివి ఓటర్ల మనస్సులపై ప్రభావం చూపుతాయని భావిస్తారు. మన దేశంలో ఒకే విడతలో ఎన్నికలు జరగవు. ఒక రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయని అనుకుందాం. మొదటి విడత పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ వెంటనే ప్రకటిస్తే.. ఏ అనే పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని వెల్లడి అయితే, రెండో విడత పోలింగ్ లో పాల్గొనే ఓటర్లపై ఆ ప్రభావం పడుతుంది. అందుకనే, ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెంటనే ప్రకటించకుండా.. అన్ని దశల పోలింగ్ పూర్తయ్యాకా వెలువరించేలా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
అసలు ఫలితాలు.. ఎగ్జిట్ పోల్ ఫలితాల మధ్య తేడా ఉండవచ్చా?
Exit Polls Explained: నూటికి నూరు శాతం కచ్చితమైన ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ లో రావడం జరగదు. ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ చెప్పడం వరకూ హెల్ప్ అవుతాయి. అంతేకానీ.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల లానే అసలు ఫలితాలు ఉండడం అనేది జరగదు. ఎందుకంటే, ఎగ్జిట్ పోల్స్ కోసం కొద్ది మంది అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటారు. అలాగే ఓటు వేసిన వారు కచ్చితంగా ఈ పార్టీకే ఓటు వేశామని నిజమే చెబుతారనేది నమ్మడం కష్టమే. కేవలం ముందస్తుగా ఒక అంచనాకు రావడానికి మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిర్వహించే సంస్థ క్రెడిబిలిటీ మీద కూడా ఆధారపడి ఉంటాయి. శాంపిల్స్ సేకరణ.. వాటి విశ్లేషణ జరిపే విధానాలు కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రభావితం చేస్తాయి.

ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పుడు?
చివరి దశ పోలింగ్ జూన్ 1 సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. ఆ తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకటన ఉంటుంది. ఆయా సంస్థలు వీటిని టీవీ ఛానల్స్, యూట్యూబ్, వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రసారం చేస్తాయి.