సీనియర్ ఎన్టీఆర్ పక్కన నుంచొన్న ఆ చిన్నోడు.. ఇప్పుడు గ్లోబల్ స్టార్

టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ నటుల్లో ఒకరు నందమూరి తారక రామారావు. కళామతల్లి ముద్దుబిడ్డగా ఎదిగిన ఎన్టీఆర్.. ఆ తర్వాత ప్రజా హృదయాలను గెలుచుకున్న రాజకీయ నేతగా మారారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టి.. మన దేశం అనే మూవీలో చిన్న పాత్ర పోషించి.. అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ స్థానానికి చేరుకున్నాడు. పౌరాణిక, ఇతిహాస గాధలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. కృష్ణుడు, రాముడు ఎలా ఉంటాడో చాలా మందికి తెలియదు కానీ.. ఎన్టీఆర్‌నే దైవంలా భావించారు తెలుగు ప్రేక్షకులు. ఆయన తెరపై కనిపిస్తుంటే జైజైలు పలకడంతో పాటు హారతులు పట్టేవారంటే.. అతని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషల్లో దాదాపు 303 చిత్రాల్లో నటించారు.


ఆయన చివరిగా నటించింది శ్రీనాథ కవి సార్వభౌముడు. కానీ అందరికీ తుది చిత్రంగా నిలిచిపోయింది మాత్రం మేజర్ చంద్రకాత్. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఫోటో స్టిల్ కూడా ఆ చిత్రంలోనిదే. ఇందులో మోహన్ బాబు, నగ్మా, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లు. ఊర్వశి శారద, ఎన్టీఆర్‌కు భార్యగా నటించింది. పరుచూరి బ్రదర్స్ అందించిన కథను తెరకెక్కించాడు రాఘవేంద్ర రావు. ఎం ఎం కీరవాణి అందించిన మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ ఫోటోలో నందమూరి తారక రామారావు పక్కన ఉన్న ఈ బాబును గమనించారా..? అతడు ఎవరో చెప్పుకోండి చూద్దాం. బహుశా అతడు ఊహించి ఉండడు.. అతనంత స్టార్ హీరోను అవుతానని. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో మాత్రమే కాదు గ్లోబల్ స్టార్.

ఇంతకు ఆ చిన్నోడు ఎవరంటే.. నందమూరి తారకరామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్. అవును తాత పక్కన ఒదిగి ఉన్న ఈ బాలుడు టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ తారక్. బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామయణం వంటి చిత్రాలతో బాల నటుడిగా అలరించిన నందమూరి వారసుడు.. అత్యంత పిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నిను చూడాలని మూవీతో హీరోగా మారిన యంగ్ టైగర్.. స్టూడెంట్ నంబర్ 1తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మీసాలు సరిగా రాని ఈ కుర్రాడు.. టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోలేదు. ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారాడు. దేవర మూవీతో పాటు వార్ 2 చిత్రాలను చేస్తున్నాడు తారక్.