హైదరాబాద్‌కు తొలి టెస్లా కారు

హైదరాబాద్‌లో తొలి టెస్లా కారు అడుగుపెట్టింది.


కొంపల్లిలోని శ్రీనందక అడ్వాన్స్‌డ్‌ సర్జరీ సెంటర్‌లో అడ్వాన్స్‌డ్‌ ల్యాప్రోస్కోపిక్‌, లేజర్‌ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ప్రవీణ్‌ కోడూరు దీనిని కొనుగోలు చేశారు. మన దేశంలో రోడ్డెక్కిన 6వ టెస్లా కారు ఇదే కావడం గమనార్హం. ముంబైలో టెస్లా షోరూమ్‌ ఏర్పాటు చేశాక కారును బుక్‌ చేసుకున్నానని.. గత నెల 27న మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలో కారు డెలివరీ తీసుకున్నానని ప్రవీణ్‌ కోడూరు చెప్పారు.

హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీవారు కూడా టెస్లా కారును బుక్‌ చేసుకున్నా.. తొలుత డెలివరీ తీసుకున్నది తానేనని తానేనని తెలిపారు. ముంబై నుంచి ఆ కారు నడుపుకొంటూ బయలుదేరామని, పుణెలో ఒకసారి, షోలాపూర్‌లో మరోమారు ఆగి చార్జింగ్‌ చేసుకున్నామని.. 770 కిలోమీటర్లు వచ్చామని వివరించారు.

అయితే తెలంగాణలో వాహన పన్ను గురించి తెలిసి షాక్‌ అయ్యానని చెప్పారు. ఈ మోడల్‌ వై టెస్లా కారు రూ.63 లక్షలకే రావాలని, కానీ తెలంగాణలో పన్నులతో ఖర్చు పెరిగిందన్నారు. విద్యుత్‌ వాహనాలపై తెలంగాణలో పన్ను లేకున్నా.. ఇతర రాష్ట్రాలలో కొనుగోలు చేసినదన్న కారణంతో 22శాతం పన్ను వసూలు చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.