జూన్‌ నుంచి ఐదు రకాల బడులు – కొత్త విధానం అమలు

వైకాపా ప్రభుత్వంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీఓ-117కు ప్రత్యామ్నాయంగా తీసుకురానున్న చర్యలను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం జూన్‌ నుంచి రాష్ట్రంలో ఐదు రకాల బడుల విధానం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న ఆరు రకాల బడుల స్థానంలో ఇది అమల్లోకి వస్తుంది. ఎక్కడా ఒక్క పాఠశాల కూడా మూసివేయకుండా ఈ విధానాన్ని విద్యాశాఖ అమలు చేయనుంది. కొత్తగా ఆదర్శ పాఠశాలలు ఏర్పాటుచేస్తుంది. పాఠశాల యాజమాన్య కమిటీ, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, విద్యార్థుల నమోదు, మౌలిక సదుపాయాల ఆధారంగా, క్లస్టర్‌ స్థాయి కమిటీ సహాయంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను గుర్తిస్తుంది.


గ్రామ పంచాయతీ, పుర, నగరపాలక సంస్థల్లో వార్డుకు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటుచేస్తుంది. 60మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న బడులు ఉంటే రెండేసి ఆదర్శ బడులను సైతం ఏర్పాటుచేస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 45మంది ఉన్నా వీటిని తీసుకొస్తుంది. వీటిల్లో ప్రతి తరగతికి ఒక టీచర్‌ చొప్పున కేటాయిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 12వేలకు పైగా ఏకోపాధ్యాయ బడులున్నాయి. ఇక్కడ 18 సబ్జెక్టులను ఒక్కరే బోధించాల్సి వస్తోంది. దీంతో పునాది స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతింటున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తరగతికి ఒక టీచర్‌ ఉండే ఆదర్శ బడుల విధానం పిల్లలకు మేలుచేస్తుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

కొత్త బడులు ఇలా..

  • శాటిలైట్‌ ఫౌండేషన్, ఫౌండేషన్, బేసిక్‌ ప్రాథమిక, ఆదర్శ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉంటాయి.
  • శాటిలైట్‌ ఫౌండేషన్‌ పాఠశాలలు(అంగన్‌వాడీలు) మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. వీటిల్లో పూర్వ ప్రాథమిక విద్య-1,2(ఎల్‌కేజీ, యూకేజీ) ఉంటుంది.
  • ఫౌండేషన్‌ బడుల్లో పీపీ-1, పీపీ-2, ఒకటో తరగతి, రెండో తరగతి వరకు బోధన చేస్తారు.
  • బేసిక్‌ ప్రాథమిక పాఠశాలల్లో పీపీ-1,2తోపాటు ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి. ఇక్కడ విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు. 20 లేదా 30మంది పిల్లలకు ఒక టీచర్‌ చొప్పున కేటాయిస్తారు. ఆదర్శ బడులు ఏర్పాటు చేయడానికి వీలు లేని చోట ఇవి ఉంటాయి.
  • ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో పీపీ-1, పీపీ-2, ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి. ఇక్కడ కనీసం 60మంది విద్యార్థులు ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో 45 మంది అంతకంటే తక్కువ ఉన్నా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు.
  • గత ప్రభుత్వంలో ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలకు తరలించిన 3,4,5 తరగతులను వెనక్కి తీసుకొస్తారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఆమోదంతో ఏర్పాటు చేసిన ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఆదర్శ పాఠశాల, ఉన్నత పాఠశాలలు నిర్ణీత దూరం కంటే ఎక్కువ ఉంటే విద్యార్థులకు రవాణా భత్యం ఇస్తారు. ఈ భత్యాన్ని నెలకు రూ.600 చొప్పున 10నెలలు చెల్లిస్తారు. ఒకరు, ఇద్దరు విద్యార్థులున్న ఫౌండేషన్‌ బడులను సైతం కొనసాగిస్తారు.
  • ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతుల్లో 30లోపు విద్యార్థులు ఉంటే వాటిని ప్రాథమిక బడులుగా మార్పు చేస్తారు. 6,7,8 తరగతులను మూడు కిలోమీటర్లలోపు ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. మూడు కిలోమీటర్లలోపు ఉన్నత పాఠశాల లేకపోయినా.. 60, అంతకంటే ఎక్కువ విద్యార్థులున్న వాటిని ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరిస్తారు. 31-59మంది విద్యార్థులు ఉంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు.
  • ఇక నుంచి 6-10 తరగతులు మాత్రమే ఉన్నత పాఠశాలలో ఉంటాయి. సహజ సిద్ధ అడ్డంకులు, జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌లు ఉంటే బేసిక్‌ ప్రాథమిక పాఠశాలలను కొనసాగిస్తారు.

ఎలా అమలు చేస్తారంటే..

  • పాఠశాల పునర్నిర్మాణం గురించి క్లస్టర్, మండల స్థాయి కమిటీలు, యాజమాన్య కమిటీల ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ మార్పుల గురించి చెబుతారు. ఆదర్శ పాఠశాల ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది విద్యార్థుల తల్లిదండ్రుల(యాజమాన్య) కమిటీనే సూచిస్తుంది.
  • తల్లిదండ్రులు వ్యతిరేకిస్తే యాజమాన్య కమిటీతో సంప్రదించిన తర్వాతే 3,4,5 తరగతులను ఆదర్శ పాఠశాలకు అనుసంధానం చేస్తారు.
  • ఒక ప్రదేశంలో మౌలికసదుపాయాలు పరిమితంగా ఉంటే ఆదర్శ పాఠశాలను 500 మీటర్లలోపు దూరంలోని రెండు ప్రదేశాల్లో నిర్వహిస్తారు. ఉదాహరణకు భవనాల కొరత ఉంటే ఒక చోట 3,4,5 తరగతులు, కొద్ది దూరంలో ఉన్న భవనాల్లో పీపీ-1,2తోపాటు ఒకటి, రెండు తరగతులు నిర్వహిస్తారు.