ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ vs పీపీఎఫ్‌.. మీ ఆర్థిక లక్ష్యాలకు ఏది సరైనది?

పెట్టుబడిదారులు ఎప్పుడైనా సురక్షిత, స్థిరమైన రాబడి కోసమే చూస్తారు. అలాంటివారికి బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ (ఎఫ్‌డీ), పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్) రెండూ ప్రధాన ఆప్షన్స్‌. ఈ రెండూ తక్కువ రిస్క్‌తో కూడుకున్నవి. అలాగే దీర్ఘకాలిక సంపద సృష్టికి ఉపయోగపడతాయి. వడ్డీ రేటు, కాలపరిమితి, పన్నులు వంటి అంశాల్లో రెండింటికీ తేడా ఉంటుంది. మరి ఈ రెండింట్లో ఏది ఎంచుకోవాలి? ఎవరి ఆర్థిక లక్ష్యాలకు ఏది సరైంది?


ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో బ్యాంకు నిర్ణయించిన వడ్డీ రేటుతో ఒక నిర్ణీత కాలానికి కొంత మొత్తాన్ని జమ చేస్తారు. వడ్డీ రేటు స్థిరంగా ఉండడం వల్ల ఆ కాలం పూర్తయ్యేసరికి ఎంత వడ్డీ వస్తుందో ముందే తెలుసుకోవచ్చు. మీరు నెల, త్రైమాసికం లేదా వార్షికానికి వడ్డీని పొందొచ్చు. కాలపరిమితి ముగిశాక ఏక మొత్తంలో అసలూ వడ్డీ కలిపి తీసుకోవచ్చు. ప్రస్తుతం టాప్‌ బ్యాంకులు ఎఫ్‌డీలపై 6-7 శాతం వడ్డీని అందిస్తున్నాయి. కాలపరిమితి బట్టి వడ్డీ రేటులో మార్పు ఉంటుంది.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అనేది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పొదుపు పథకం. దీర్ఘకాలిక పొదుపు, ముఖ్యంగా పదవీవిరమణ తర్వాత అవసరాలకు ఈ పథకం ఉపయోగపడుతుంది. పీపీఎఫ్‌ ఖాతాకు 15 సంవత్సరాల గడువు ఉంటుంది. మెచ్యూరిటీ ముగిసిన తర్వాత కూడా ఖాతా మరింత కాలం కొనసాగించే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి పీపీఎఫ్‌ వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేటు సంవత్సరానికి 7.1  శాతంగా ఉంది.

ఏది బెటర్‌

  • మీరు స్వల్పకాలిక నుంచి మధ్యకాలిక లక్ష్యాల కోసం చూస్తే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం. స్థిరమైన రాబడులు ఇస్తాయి. ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. ఇక పీపీఎఫ్‌ విషయానికొస్తే.. ఇది పదవీవిరమణ, పిల్లల చదువు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు ఉపయోగకరంగా ఉంటుంది.
  • ఎఫ్‌డీలో ఎంత వడ్డీ వస్తుందో ముందే తెలుస్తుంది. వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పీపీఎఫ్ మాత్రం దీర్ఘకాలిక పిగ్గీ బ్యాంక్‌ లాంటిది. 15 ఏళ్లపాటు డబ్బు జమ చేస్తే పన్నురహిత వడ్డీతో అది పెరుగుతూ ఉంటుంది.
  • ఎఫ్‌డీల్లో ఎంత మొత్తం, ఎంత కాలం పెట్టుబడి పెట్టాలనేది మీరు స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు. పీపీఎఫ్‌లో కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1.5 లక్షలు మాత్రమే జమ చేయొచ్చు. మీ ఖాతాను యాక్టివ్‌గా ఉంచడానికి ఓ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.
  • ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటుతో 15 ఏళ్లపాటు ఏటా రూ.లక్షన్నర చొప్పున పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టినట్లయితే మొత్తం పెట్టుబడి రూ.22 లక్షలవుతుంది. దీనికి దాదాపు రూ.18 లక్షలు వడ్డీ వస్తుంది. మొత్తంగా రూ.40 లక్షలు చేతికందుతుంది.
  • అదే రూ.1.5 లక్షలను 7 శాతం వడ్డీ రేటుతో ఏకమొత్తంలో 15 ఏళ్లకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే రూ.2,74,772 వడ్డీతో కలిపి మొత్తం రూ.4,24,772 చేతికందుతుంది.

చివరిగా: ఎఫ్‌డీలో మీరు వివిధ కాలపరిమితులను ఎంచుకొని అవసరానికి అనుగుణంగా మళ్లీ రీ-ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే, ఎఫ్‌డీ రాబడిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పీపీఎఫ్‌లో వడ్డీ, మెచ్యూరిటీపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. కాబట్టి ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు ఈ రెండు సురక్షిత పెట్టుబడి మార్గాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

గమనిక: ఈ వార్త/ కథనం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడులపై సొంతంగా లేదా ఆర్థిక నిపుణుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.