ఘుమఘుమలాడే “వాము చారు” – పిల్లలకూ చాలా బాగా నచ్చుతుంది

రెగ్యులర్ కర్రీలు తిని బోరింగ్​గా అనిపించినప్పుడు కమ్మకమ్మగా ఏదైనా రసం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు చాలా మంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది టమాటా చారు, పప్పు చారు, చింతపులుసు వంటివి చేసుకుంటుంటారు. కానీ, అవి మాత్రమే కాదు చలికాలంలో మీరు తప్పక ట్రై చేయాల్సిన మరో అద్భుతమైన రసం రెసిపీ ఉంది. అదే, టేస్టీ అండ్ హెల్దీ “వాము చారు”. చల్లని క్లైమేట్​లో ఘాటు ఘాటుగా గొంతులోకి దిగుతుంటే ఆ కిక్కే వేరబ్బా! పిల్లలూ ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. దీని తయారీకి టైమ్ కూడా తక్కువగానే పడుతుంది. అలాగే, వింటర్​లో ఎక్కువ ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. మరి, మంచి రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఈ వాము చారును ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


అవసరమైన పదార్థాలు :

వాము పొడి కోసం :

  • ఒకట్రెండు టీస్పూన్లు – వాము
  • నాలుగు – ఎండుమిర్చి
  • ఒక టీస్పూన్- ధనియాలు
  • అర టీస్పూన్ – జీలకర్ర
  • చారు కోసం :

    • ఒకట్రెండు టీస్పూన్లు – నూనె
    • పావు టీస్పూన్ – మెంతులు
    • అర టీస్పూన్ – జీలకర్ర
    • అర టీస్పూన్ – ఆవాలు
    • నాలుగైదు – వెల్లుల్లి రెబ్బలు
    • 30 గ్రాములు – చింతపండు(తగినంత)
    • మూడు – పచ్చిమిర్చి
    • పావు టీస్పూన్ – పసుపు
    • రుచికి తగినంత – ఉప్పు
    • కొద్దిగా – కరివేపాకు
    • కొత్తిమీర తరుగు – కొంచెం
    • తయారీ విధానం :

      • ఈ టేస్టీ అండ్ హెల్దీ రసం రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో చింతపండును తీసుకుని శుభ్రంగా కడగాలి.
      • తర్వాత అందులో సరిపడినన్ని నీళ్లు పోసి 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
      • అది నానేలోపు రెసిపీలోకి కావాల్సిన వాముపొడిని సిద్ధం చేసుకోవాలి. అందుకోసం మిక్సీ గిన్నెలో ఒకట్రెండు టీస్పూన్లు వాము, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టుకుని పక్కనుంచాలి.
      • ఇప్పుడు బాగా నానిన చింతపండు నుంచి చిక్కని గుజ్జు తీసుకోవాలి. తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి రసం 250 ఎంఎల్ క్వాంటిటీలో ఉండేలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
      • అనంతరం చారు కోసం స్టవ్ మీద కడాయి లేదా పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి.
      • అవి వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకుని మరికాసేపు ఫ్రై చేసుకోవాలి.
      • ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేసుకోవాలి.
      • అలాగే, పసుపు, రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి.
    • ఆపై మీరు చారు కావాలనుకునే క్వాంటిటీని బట్టి తగినన్ని నీళ్లు(పావు లీటర్) పోసుకోవాలి. ఆపై ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాముపొడిని జత చేసి మరోసారి అంతా బాగా కలిసేలా కలపాలి.
    • తర్వాత స్టవ్​ను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 10 నుంచి 12 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
    • ఆ మిశ్రమం బాగా మరిగి బబుల్స్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, మంచి ఫ్లేవర్​తో ఘుమఘుమలాడే “వాము చారు” అప్పటికప్పుడు తయారవుతుంది!
    • దీన్ని వేడివేడి అన్నంలో కాస్త పోసుకుని తిన్నారంటే ఆ టేస్ట్ నెక్ట్స్ లెవల్​లో ఉంటుంది. పిల్లలూ ఈ చారుతో నాలుగు ముద్దలు ఎక్కువే లాగించేస్తారు!
    • మరి, నచ్చితే మీరూ ఎప్పుడూ చేసుకునే రసం రెసిపీలకు బదులుగా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఈ సీజన్​లో ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది!
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.