పొగమంచు ప్రమాదం.. అప్రమత్తతే ప్రధానం

శీతాకాలంలో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. వాహనంలో ప్రయాణిస్తుంటే రోడ్లMý ు ఇరువైపులా పొగమంచు హృద్యంగా కనువిందు చేస్తుంది. కారులోగానీ ఇతర వాహనాల్లో మంచి సంగీతం వింటూ డ్రైవింగ్‌ చేయడం మధురానుభూతి కలిగిస్తుంది. కానీ ఆ పొగమంచు మాటునే ప్రమాదం పొంచి ఉందన్నది డ్రైవర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేశంలో రహదారులపై పొగమంచు కమ్మేయంతో రోడ్డు ప్రమాదాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఒక్క శీతాకాలంలోనే దేశంలో ఏటా 30 వేలకుపైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.


మొత్తం రోడ్డు ప్రమాదాల్లో పొగమంచుతో సంభవిస్తున్న ప్రమాదాలు 7% వరకు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఓ ట్రావెల్స్‌ బస్సు లోయలోపడి ప్రమాదానికి గురికావడంతో 9మంది దుర్మరణం చెందడంతోపాటు 37మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. పొగమంచును బస్సు డ్రైవర్‌ సరిగా అంచనా వేయలేక పోవడంతోనే ఈ ప్రమాదం సంభవించింది.

అందుకే శీతాకాలంలో వాహనాలను డ్రైవింగ్‌ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో 7గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు పరుచుకుని ఉంటుంది. ఘాట్‌ రోడ్లలో పొగమంచు మరింత దట్టంగా కమ్మేస్తుంది కూడా. అందుకే అరకు, మారేడుమిల్లి, శ్రీశైలం, తిరుమల, హార్స్‌లీ హిల్స్‌ వంటి ఘాట్‌ రోడ్లపై ప్రయాణించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. పొగమంచులో డ్రైవింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

చేయాల్సినవి…
» లో బీమ్‌ హెడ్‌లైట్లనే ఉపయోగించాలి. హై బీమ్‌ లైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
» పొగమంచు దారిలో ప్రయాణిస్తున్నంతసేపు ఫాగ్‌లైట్లు ఆన్‌ చేయాలి.
» టైల్‌ ల్యాంప్స్‌ను క్లీన్‌గా ఉంచాలి. స్పష్టంగా కనిపించేట్టుగా ఉండాలి.
» బ్రేక్‌ లైట్లు కచ్చితంగా పనిచేసేట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో వాహనం నెమ్మదించగానే ఆ విషయం వెనుక వాహనదారులకు గుర్తించగలరు.
» వాహనంలో టూల్‌ కిట్‌ తప్పనిసరిగా ఉంచుకోవాలి.
» రోడ్లపై ఉన్న లైన్‌ మార్కింగ్‌లను గమనిస్తూ.. తదనుగుణంగా డ్రైవింగ్‌ చేయాలి. రోడ్డుకు కుడి, ఎడమ చివర్లో ఉన్న లైన్లను దాటి వెళ్లకూడదు. ఒక లైన్‌ నుంచి మరో లైన్‌లోకి మారేటప్పుడు వెనుక, పక్కన ఉన్న వాహనాలను గమనించాలి. వెనుక నుంచి ఏ వాహనం రావడం లేదని నిర్ధారించుకున్న తరువాతే లైన్‌ మారాలి.
» వాహనం వైపర్లు సరిగా పని చేసేట్టుగా చూసుకోవాలి.
» వాహనాన్ని నిలుపుదల చేయాల్సి వస్తే… రోడ్డుకు ఎడమవైపు లైన్‌లోనే నిలపాలి.
» ఎదురుగా వెళుతున్న వాహనాలకు తగినంత దూరంగా ఉంటూ వాహనాన్ని
నడపాలి.
» రోడ్డు సరిగా కనిపించడంలేదని గుర్తించగానే వాహనాన్ని రోడ్డు పక్కగా నిలిపివేయాలి. జాతీయ రహదారులపై నిర్దేశించిన పార్కింగ్‌ ప్రదేశాలు, సమీపంలోని దాబాలు, పెట్రోల్‌ బంకులు, టోల్‌ ప్లాజాల వద్ద ఉండే పార్కింగ్‌ ప్రదేశంలోనే వాహనాలను నిలపాలి.
» విండ్‌ షీల్డ్‌ క్లీన్‌గా ఉండాలి. యాంటీ ఫాగింగ్‌(డీ ఫాగర్‌) మోడ్‌లో వాహనం ఉంచి నడపాలి.

చేయకూడనివి…
» మితివీురిన వేగంతో ప్రయాణించవద్దు. పరి మిత వేగంతోనే డ్రైవింగ్‌ చేయాలి. వాహనం ఎప్పుడూ డ్రైవర్‌ నియంత్రణ ఉండాలి. రోడ్డును స్పష్టంగా చూడగలిగేంత వేగంతోనే ప్రయాణించాలి.
»దారిలో పొగమంచు ఉన్నప్పుడు ముందు వెళ్తున్న వాహనాలను ఎట్టి పరిస్థితిల్లోనూ ఓవర్‌ టేక్‌ చేయకూడదు.
» క్రూయిజ్‌ కంట్రోల్‌ మోడ్‌లో వాహనాన్ని నడపకూడదు.
» డ్రైవింగ్‌ చేస్తున్నపుడు డ్రింక్స్‌ తాగడం గానీ ఏమైనా తినడంగానీ చేయకూడదు. పొగ తాగకూడదు.
» ఎదురుగా వాహనం వస్తుంటే హైబీమ్‌ లైట్లను ఫ్లాష్‌ చేయ కూడదు.
» డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు హజార్డ్‌ (త్రికోణాకృతి)లైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌ చేయకూడదు. వాహనాన్ని పార్క్‌ చేసినప్పుడే ఇతరులు గమనించేందుకు హజార్డ్‌ లైన్లను ఆన్‌ చేసి ఉంచాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.