ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా కొత్త మోడల్ కార్లతో ఎప్పటికప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. విభిన్నమైన డిజైన్లు, వివిధ రకాల ఫీచర్లు, మోడళ్లతో కార్లను ఆవిష్కరిస్తూ ఆశ్చర్యపరుస్తుంది.
ట్రెండ్‌ను అందిపుచ్చుకుంటూ ఆటోమొబైల్ రంగంలో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ క్రేజ్ కొనసాగుతోంది. దీంతో అన్నీ కంపెనీలు ఎస్యూవీ వెహికల్స్ తయారీలో దూకుడు పెంచాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అడ్వాన్స్ ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్న ఎస్యూవీ వెహికల్స్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. వీటి అమ్మకాలు కూడా రికార్డ్ స్థాయిలో ఉంటున్నాయి. ఈ ఏడాది గణాంకాలు చూసుకుంటే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లే ఎక్కువగా ఉన్నాయి.
ప్రత్యేకతలు ఇవే..
అయితే మహీంద్రా కంపెనీ పెద్ద వాహనాల తయారీనే కాకుండా వినూత్న ఆవిష్కరణలు చేస్తోంది. తాజాగా XEV 9S కారుతో పాటు పిల్లల కోసం బీఈ 6 ఫార్ములా రైడర్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు BE6 ఫార్ములా E ఎడిషన్‌ను పోలి ఉంటుంది. కానీ ముందు, వెనుక LED లైట్లను కలిగి ఉంది. తలుపులు కూడా సులువుగా తెరుచుకోవడం వల్ల పిల్లలు సింపుల్‌గా కారు లోపలికి వెళ్లొచ్చు. అంతేకాకుండా దీని లోపల పిల్లలను ఆకట్టుకోవడానికి నకిలీ పరికరాలు కూడా ఉంటాయి. బ్లూటూత్ ఆడియో సిస్టమ్‌తో పాటు పిల్లలు కూర్చోవడానికి సరిపోయేలా సింగిల్ సీటు, సీట్ బెల్ట్ కూడా ఉంటుంది.
రిమోట్ కంట్రోల్ యూనిట్
ఈ కారులో చిన్న రీఛార్జబుల్ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్ ఒకటి ఉంటుంది. దీని ద్వారా డ్రైవర్ వాహనాన్ని స్వయంగా నడపొచ్చు. అంతేకాకుండా దీనికి రిమోట్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. దీని ద్వారా తల్లిదండ్రులు కూడా కారును కంట్రోల్ చేయవచ్చు.
ధర ఎంతంటే..?
ఈ రైడ్ కారు ధర రూ.18 వేలుగా మహీంద్రా కంపెనీ నిర్ణయించింది. కారును గురువారం లాంచ్ చేయగా.. బుకింగ్స్, డెలివరీ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ కారు పిల్లలకు మంచి ఎంపికగా చేప్పుకోవచ్చు.
































