తెలంగాణ రాజకీయాల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు.
ప్రస్తుతం ఆయన వయస్సు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ప్రజల నాయకుడిగా గుర్తింపు..
రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల సమస్యలకు అండగా నిలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐటీశాఖ మంత్రిగా కూడా పనిచేసి.. ముఖ్యంగా సూర్యాపేట, నల్లగొండ ప్రాంతాల్లో సాగు నీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయనను ప్రజలు ప్రేమగా “టైగర్ రామ్”గా పిలుస్తుంటారు.
రాజకీయ ప్రస్థానం..
రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా సేవ చేసి, పార్టీ కార్యకర్తలతోపాటు ప్రజలకు కూడా ప్రియమైన నాయకుడిగా నిలిచారు. తన రాజకీయ జీవితంలో ప్రజల సమస్యలే తన సమస్యలే అన్న నమ్మకంతో, అనేక సవాళ్లను ఎదుర్కొని విజయవంతంగా ప్రజాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
అంత్యక్రియల ఏర్పాట్లు..
అక్టోబర్ 3 మధ్యాహ్నం నుంచి సూర్యాపేట రెడ్ హౌస్లో.. అభిమానులు, పార్టీ కార్యకర్తలు సందర్శనార్ధం ఉంచనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్టోబర్ 4న సూర్యాపేటలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడతాయని సమాచారం.
రాష్ట్ర నాయకుల సంతాపం..
రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర, జాతీయ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాక, తెలంగాణ రాజకీయాలకు కూడా తిరిగిరాని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
































