గబ్బర్ సింగ్ ఇప్పుడు రబ్బర్ సింగ్ అయ్యాడు.. పవన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా మెలికలు తిరుగుతున్నాడంటూ ఘాటైన విమర్శలు చేసారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా.


తాజాగా విడుదల చేసిన వీడియోలో కూటమి సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా ప్రజలు సముద్రంలా తరలివస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇది చూసే ధైర్యం కూటమికి లేదని, అందుకే కుట్రలకు దిగుతున్నారని ఆరోపించారు. ఈవీఎంలతో సంబంధం ఉన్న విమర్శలు ప్రజల్లో ఇప్పటికే చర్చనీయాంశమైపోయాయని రోజా తెలిపారు.

జూన్ 18న జగనన్న కాన్వాయ్ ముందు మరణించిన వ్యక్తిపై ఎస్పీ ముందుగా చెప్పిన మాటల్ని, ఆ తర్వాత మార్చిన వ్యాఖ్యలను రోజా ఎత్తిచూపారు. నిజంగా మృతుడి విషయంలో వారి వాదన సత్యమైతే డ్రైవర్‌పై కేసు పెట్టాలి గానీ జగన్‌పై ఎందుకు కేసు పెట్టారు అని ప్రశ్నించారు. ఇదే తీరుతో గతంలో చోటుచేసుకున్న విమాన ప్రమాదం, సింహాచలం గోడ కూలిన ఘటన, గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో జరిగిన మరణాలు వంటి విషయాల్లో ఎందుకు కేసులు పెట్టలేదని ఆమె ప్రశ్నించారు. కేసులు పెట్టాలంటే అన్ని విషయాల్లో ఒకే న్యాయం ఉండాలని, అధికార దుర్వినియోగం ఆపాలని ఆమె కోరారు.

ఎన్నికల సమయంలో ప్రజల్ని అబద్ధాలతో మోసగించి ఓట్లు కొట్టుకున్న కూటమి నేతలే మానవత్వంలేని వారు అని రోజా పేర్కొన్నారు. కరోనా సమయంలో జగన్ ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను ఎలా కాపాడిందో రాష్ట్ర ప్రజలు మరిచిపోలేరని చెప్పారు. జగన్ ప్రజల మద్దతుతో ముందుకెళ్తున్నారని, నేడు రైతులు, యువత, మహిళలు అన్నిరంగాల్లో ఆయన్నే నమ్ముతున్నారని రోజా అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలను నీరుగార్చే పనుల్లో బిజీగా ఉండగా, జగన్ మాత్రం మరోసారి ప్రజల మద్దతుతో నిలబడతారని ఆమె గట్టిగా ప్రకటించారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.