Gallbladder | గాల్‌బ్లాడర్‌లో అసలు రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Gallbladder | గాల్‌బ్లాడర్.. అదే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది.


గాల్‌బ్లాడర్‌లో రాళ్లను ముందుగానే గుర్తిస్తే మందులు వాడటం ద్వారా తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు ఆపరేషన్‌ కూడా అవసరమవుతుంది. అదే పిత్తాశయంలో రాళ్లను గుర్తించకపోతే మాత్రం అది తీవ్ర సమస్యగా.. ఒక్కోసారి క్యాన్సర్‌గా కూడా ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అసలు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? రాళ్లు రావద్దంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు పిత్తాశయం ఏ పనిచేస్తుంది?

కాలేయం కింది భాగంలో పిత్తాశయం (గాల్‌బ్లాడర్‌ ) అతుక్కుని ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉంటే.. వాటిని జీర్ణం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మనం తిన్న ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన కొవ్వులు పిత్తాశయంలోకి వెళ్తాయి. ఇందులో విడుదలైన పైత్యరసం.. కొవ్వును చిన్ని చిన్న భాగాలుగా విడగొడుతుంది. అయితే గాల్‌బ్లాడర్‌లో కొవ్వు అధికంగా పేరుకుపోతే అది గట్టిపడి రాళ్లలా మారే ప్రమాదం ఉంది. ఇవి ఇసుక రేణువు అంత సైజులో మొదలయ్యి.. గోల్ఫ్‌ బాల్‌ అంత సైజు వరకూ పెరుగుతుంది. గాల్‌బ్లాడర్‌లో నుంచి రాళ్లు పిత్త వాహికలోకి ప్రవేశిస్తే అది కామెర్లు, ప్యాంక్రియాస్‌ వాపు సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యను ఎక్కువ కాలం గుర్తించపోతే కేన్సర్‌ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చు.

రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?

ఈ బిజీ లైఫ్‌లో మారిన లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడటం కామన్‌ అయిపోయింది. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే, పెయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు, డయాబెటిస్, జీర్ణ సమస్యలతో బాధ పడేవాళ్లలో గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్‌ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రాకుండా మహిళలు వాడే పిల్స్‌ కూడా పిత్తాశయంలో రాళ్లకు కారణం అయ్యే అవకాశం ఉంది. బిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా కొంతమంది సరిగ్గా భోజనం చేయరు. ఖాళీ కడుపుతోనే ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఇంటి పనులు చేస్తూ, పిల్లలను చూసుకోవడం కారణంగా సరిగ్గా భోజనం చేయరు. ఇలా చేయడం వల్ల పిత్తాశయంలో ద్రవం పేరుకుపోతుంది. ఇది పిత్తాశయంలో కొవ్వు స్థాయులను పెంచుతుంది. ఇదే దీర్ఘకాలం ఉండటం వల్ల రాళ్లు ఏర్పడతాయి. రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే ఆహారంలో నూనె, మసాలాలను తక్కువగా తీసుకోవాలి.

లక్షణాలు ఏంటి?

సాధారణంగా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్న 75 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఎప్పుడైతే గాల్‌బ్లాడర్‌ విడుదల చేసే పైత్యరసానికి ఈ రాళ్లు పడతాయో అప్పుడు నొప్పి మొదలవుతుంది. ఇలా రాళ్లు అడ్డుపడినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

– కుడి వైపు పొత్తి కడుపులో నొప్పి
– కుడి భుజం నొప్పి
– వాంతులు, వికారం
– జీర్ణ సంబంధ సమస్యలు, కడుపు ఉబ్బరంగా ఉండటం

పై లక్షణాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా అల్ట్రా సౌండ్‌ చేయించుకోవాలి. రాళ్లు అధికంగా ఉన్నట్లయితే సర్జరీ ద్వారా గాల్‌బ్లాడర్‌ను తొలగిస్తారు. సర్జరీ తర్వాత రోగి కేవలం ఒక్క రోజు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. అనంతరం వారం రోజుల్లో రోగి కోలుకుంటారు. అయితే, గాల్‌బ్లాడర్‌ సర్జరీ తర్వాత రోగులు తమ ఆహారం, లైఫ్‌స్టైల్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.