Gam Gam Ganesha Review: రివ్యూ: గం గం.. గణేశా.. ఆనంద్‌ దేవరకొండ క్రైమ్‌ కామెడీ మూవీ మెప్పించిందా?

www.mannamweb.com


Gam Gam Ganesha Review: రివ్యూ: గం గం.. గణేశా.. ఆనంద్‌ దేవరకొండ క్రైమ్‌ కామెడీ మూవీ మెప్పించిందా?
Gam Gam Ganesha Review || చిత్రం: గం గం గణేశా; నటీనటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక, ఇమ్మాన్యుయేల్‌, వెన్నెల కిషోర్‌, రాజ్‌ అర్జున్‌, సత్యం రాజేశ్‌ తదితరులు; సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌; ఎడిటింగ్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌ ఆర్‌; సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది; నిర్మాత: కేదార్‌ శెలగంశెట్టి, వంశీ కారుమంచి; రచన, దర్శకత్వం: ఉదయ్‌ బొమ్మిశెట్టి; విడుదల: 31-05-2024

విజయ్‌ దేవరకొండ సోదరుడిగా వెండితెరకు పరిచయమైనా తన ఇమేజ్‌కి సరిపోయేలా కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకుసాగుతున్న యువ కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ. ‘బేబీ’తో గతేడాది బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఆనంద్‌.. ఇప్పుడు క్రైమ్‌ కామెడీ జానర్‌లో యాక్షన్‌ అంశాలు మేళవించిన ‘గం గం.. గణేశా’ (Gam Gam Ganesha Review) అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? (Gam Gam Ganesha Review) ఆనంద్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

కథేంటంటే: గణేశ్‌ (ఆనంద్‌ దేవరకొండ) అనాథ. స్నేహితుడి(ఇమ్మాన్యుయేల్‌)తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ప్రేమించిన అమ్మాయి శ్రుతి (నయన్‌ సారిక) డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడంతో ఎలాగైనా తానూ ధనవంతుడు కావాలనుకుంటాడు. దీంతో ఓ నగల దుకాణంలో రూ.7 కోట్ల విలువైన వజ్రాన్ని దొంగతనం చేసే డీల్‌ ఒప్పుకొని ఆ పని పూర్తి చేస్తాడు. అత్యాశకు పోయి ఆ వజ్రాన్ని తానే విక్రయించి డబ్బు సంపాదించాలనుకుంటాడు. వజ్రాన్ని చెన్నై తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో భయపడి అటుగా వెళ్తున్న భారీ వినాయకుడి విగ్రహం తొండంలో దాన్ని పడేస్తాడు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్‌రెడ్డి (రాజ్‌ అర్జున్‌) ఆర్డర్‌ మేరకు ఆ వినాయకుడి విగ్రహాన్ని ముంబయిలో ప్రత్యేకంగా తయారుచేయించి, ఊరికి తీసుకొస్తుంటాడు కిరాయి రౌడీ రుద్ర (కృష్ణ చైతన్య). అయితే, కిషోర్‌రెడ్డి ఊరికి వెళ్లాల్సిన ఆ విగ్రహం కాస్తా తన ప్రత్యర్థి రాజకీయ నాయకుడు ఉన్న రాజావారిపల్లెకు వెళ్తుంది. ఇంతకీ ఆ విగ్రహంలో ఏముంది? కిషోర్‌రెడ్డి ప్రత్యేకంగా ఆ విగ్రహాన్ని తయారు చేయించడం వెనుక కారణం ఏంటి? వినాయకుడి విగ్రహంలో ఉండిపోయిన ఆ వజ్రాన్ని గణేశ్‌ ఎలా తిరిగి సంపాదించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: భయం.. అత్యాశ.. కుట్ర.. ప్రతీ మనిషి ఏదోఒక సమయంలో ఈ మూడింటి గురించి ఆలోచిస్తాడు. ఆయా సందర్భాలు ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పించుకునేందుకు లేదా కావాల్సింది దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తాడు. కొన్నిసార్లు ప్రాణాలను సైతం పణంగా పెడతాడు. కథానాయకుడికి ఈ మూడూ పరీక్ష పెడితే వాటి నుంచి ఎలా తప్పించుకుని బయటపడ్డాడన్నదే ‘గం. గం.. గణేశ్‌’. ఈ ఎలిమెంటుకి కామెడీ జోడించి వినోదాన్ని పంచడంలో దర్శకుడు ఉదయ్‌శెట్టి పాసయ్యారు. ఒక ఆసక్తికర వస్తువు, అంశం చుట్టూ కథానాయకుడు, విలన్‌ గ్యాంగ్‌ తిరగడం అన్నది కొత్త పాయింట్ ఏమీ కాదు. (Gam Gam Ganesha Review) కానీ, దానికే కాస్త కామెడీ, కాస్త థ్రిల్‌ జోడించి ఉదయ్‌శెట్టి మూవీని అందించాడు.

గణేశ్‌, అతడి లైఫ్‌ స్టైల్‌ను పరిచయం చేస్తూ కథను మొదలుపెట్టిన దర్శకుడు.. లవ్ ట్రాక్‌తో అసలు పాయింట్‌కు రావడానికి కాస్త కథను సాగదీశాడు. ఎప్పుడైతే గణేశ్‌కి డబ్బు సంపాదించాలన్న కసి పుడుతుందో అప్పటి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఒకవైపు గణేశ్‌ కథ చూపిస్తూనే మరోవైపు కిషోర్‌రెడ్డి ప్రత్యేక వినాయకుడి విగ్రహాన్ని ముంబయి నుంచి తీసుకొచ్చే ప్లాట్‌ను సమాంతరంగా నడిపాడు. పోలీసులకు భయపడి గణేశ్‌ ఆ వజ్రాన్ని వినాయకుడి తొండంలో వేయడం, కిషోర్‌రెడ్డి తయారు చేయించిన విగ్రహం రాజావారి పల్లెకు వెళ్లడంతో తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో విరామమిచ్చిన తీరు బాగుంది. రాజావారి పల్లెకు చేరిన తర్వాత ద్వితీయార్ధం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రత్యర్థి రాజకీయ నాయకుడి ఊరి నుంచి కిషోర్‌రెడ్డి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు రుద్ర, అతడి గ్యాంగ్‌ చేసే ప్రయత్నాలు ఒకవైపు… వజ్రం కోసం గణేశ్‌, అతడి స్నేహితుడు వేసే ప్లాన్‌లు ఆద్యంతం నవ్వులు పంచుతూ ద్వితీయార్ధం సాగుతుంది. మతి భ్రమించిన డాక్టర్‌ ఆర్గానిక్‌ డేవిడ్‌గా వెన్నెల కిషోర్‌ పాత్ర కనిపించిన ప్రతిసారీ థియేటర్‌లో నవ్వులే నవ్వులు. (Gam Gam Ganesha Review) డాక్టర్‌ డేవిడ్‌ వల్ల అటు రుద్ర గ్యాంగ్‌, ఇటు గణేశ్‌ పడే ఇబ్బందులు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ ట్రాక్‌ మొత్తం హెలేరియస్‌గా పండింది. మధ్యలో గణేశ్‌కు నీలవేణి (ప్రగతి శ్రీవాస్తవ)తో లవ్‌ ట్రాక్‌ పెట్టడం అసలు కథ కాస్తకు పక్కకు వెళ్లినట్లు అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో స్వామీజీ (రాంజగన్‌) పాత్రతో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి అలరించాడు దర్శకుడు. ఆయా సన్నివేశాలు, తుపాకీలతో కాల్చుకోవడం ‘స్వామి రారా’ క్లైమాక్స్‌ను గుర్తు చేస్తాయి.

ఎవరెలా చేశారంటే: ‘బేబీ’ వంటి లవ్‌ ఎమోషనల్‌ డ్రామా తర్వాత ఆనంద్‌ దేవరకొండ క్రైమ్‌ కామెడీతో వైవిధ్యంగా ప్రయత్నించారు. గణేశ్‌ పాత్రకు ఆయన చక్కగా సూటయ్యారు. యాక్షన్‌కు అవకాశం ఉన్నా, దాని జోలికి పోకుండా తన పాత్ర పరిధి మేరకు నటించారు. ఎమోషనల్‌ డైలాగ్స్‌, భావోద్వేగ సన్నివేశాల్లో నటన ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. ఈ చిత్రంలో కథానాయికలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ప్రథమార్ధంలో నయన్‌ సారిక, ద్వితీయార్ధంలో ప్రగతి శ్రీవాస్తవ జస్ట్‌ టైమ్‌పాస్‌ అంతే. కిషోర్‌రెడ్డిగా రాజన్‌, రుద్రగా కృష్ణ చైతన్య తమదైన శైలిలో నటించారు. ఆనంద్‌ స్నేహితుడిగా ఇమ్మాన్యుయేల్‌, మెంటల్‌ డాక్టర్‌ ఆర్గాన్‌ డేవిడ్‌గా వెన్నెల కిషోర్‌ పాత్రలు సినిమాకు ప్రధానబలం. (Gam Gam Ganesha Review) ఆ రెండు పాత్రలు చక్కటి హాస్యాన్ని పంచాయి. ఎక్కడా కూడా అసభ్యతకు తావులేకుండా కామెడీని పండించడం మెచ్చుకోదగిన విషయం. సాంకేతికంగా సినిమా బాగుంది. చైతన్‌ భరద్వాజ్‌ పాటలు, ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ బాగున్నాయి. కార్తిక్‌ శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. ఉదయ్‌ బొమ్మిశెట్టి ఎంచుకున్న కథ కొత్తదేమీ కాకపోయినా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడంలో పర్వాలేదనిపించారు. ప్రతినాయకుడి పాత్రను కూడా ఇంకాస్త బలంగా చూపించాల్సింది. ప్రథమార్ధంలో లవ్‌ ట్రాక్‌ అవసరం లేదు. దానికి బదులు ద్వితీయార్ధంలోనే వెన్నెల కిషోర్‌ ట్రాక్‌ పెంచి ఉంటే ప్రేక్షకులు మరింత ఆస్వాదించేవారు.

బలాలు
+ నటీనటులు,
+ వెన్నెల కిషోర్‌, ఇమ్మాన్యుయేల్‌ కామెడీ
+ ద్వితీయార్ధం
బలహీనతలు
– ప్రథమార్ధంలో లవ్‌ ట్రాక్‌
– అక్కడక్కడా నెమ్మదిగా సాగే సన్నివేశాలు
చివరిగా: ఎంటర్‌టైనింగ్‌ గణేశా..! (Gam Gam Ganesha Review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే