హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి వినాయక చవితి. ఆది దంపతుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటాం. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చవితి రోజున వినాయక చవితి పండగను జరుపుకుంటారు.
ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. వినాయక చవితి రోజున వినాయకుడిని పూజించేందుకు పత్రిని ఉపయోగిస్తారు. 21 రకాల ఆకులతో పుజిస్తారు. అయితే ఈ పూజలో ఉపయోగించే పత్రిలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఈ నియమం వెనుక మన పూర్వీకులకు ఉన్న ముందు చూపు అని అంటారు. ఎందుకంటే వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు వస్తాయి. వ్యాధి నివారణకు వన మూలికలను గుర్తు చేయడమే ఈ పత్రితో పూజ నియమం అని అంటారు. ఈ రోజు 21 రకాల పత్రి.. ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
- మాచిపత్రి: మంచి సువాసన ఉంటుంది. దీనికి వేడి చేసే స్వభావం ఉంది. మాచిపత్ర నూనెని ఉపయోగిస్తే ఆహారం జీర్ణం అవుతుంది. ఆకలి కలుగుతుంది. మనోవైకల్యము, అలసట నివారించును.
- ములక (బృహతీ పత్రం): దగ్గు , ఆయాసాన్ని తగ్గిస్తుంది. ఆకలిని కలిగిస్తుంది. మూత్ర విసర్జన అవుతుంది. కండరాలకు పుష్టిని. వీర్యవృద్ధిని ఇస్తుంది. ములక వేసి ఆముదం వేడి చేసిన తాగితే వాతం తగ్గుతుంది. నేల ములక వేరు రసం , తేనె కలిపి తీసుకున్నా దగ్గు తగ్గుతుంది.
- మారేడు: ఈ చెట్టు అన్ని భాగాలు ఔషధ గుణాలు ఉన్నవే. మారేడు కాయల్లోని గుజ్జు అతిసార రోగాన్ని తగ్గిస్తుంది. విషాన్ని హరిస్తుంది. దీని ఆకుల రసం మధుమేహవ్యాధి నివారణలో ఉపయోగపడుతుంది.
- గరిక: ఇది కలుపు మొక్క. అయితే మంచి క్రిమిసంహారిణి. అంటు వ్యాధుల నుంచి కాపాడుతుంది. చర్మరోగాలు నివారణలో ఉపయోగపడుతుంది. గరిక రసం వాంతులు, విరేచనములు తగ్గిస్తుంది. గాయాలకు దీని రసము ఉపయోగిస్తారు. దీని వేర్ల కషాయం గనేరియా వ్యాధిలో పై పూతకు ఉపయోగిస్తారు.
- నల్ల ఉమ్మెత్త: తేలు మొదలగు విషజంతువుల విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఉమ్మెత్త ఆకులను ఉబ్బసం, కోరింతదగ్గు మొదలైన వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. కీళ్లనొప్పుల నివారణకు దీని ఆకుతో కాపడం పెడతారు. అయితే ఇది విషప్రభావం కలిగిన మొక్క. కనుక దీనిని శుద్ది చేయకుండా.. అనుభవం లేనివారు ఉపయోగించరాదు.
- రేగు: గొప్ప ఔషధ గుణములు కలిగి ఉన్నాయి. మొలల సమస్య ఉన్నవారు రేగుచెక్క కషాయంలో కూర్చో బెట్టడం వలన ఫలితం ఉంటుంది. మూత్రశాయుంలో రాళ్లు కరుగడానికి రేగు వేరు కషాయంలో రేగు బెరడు చూర్ణం కలిపి తాగడం వలన ఫలితం ఉంటుంది. రేగు వేరు పైన బెరడు మేకపాలతో కలిపి నూరి పూసిన మంగు మచ్చలు తగ్గుతుంది.
- ఉత్తరేణి: దీని వేర్లు దంతాలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఉత్తరేణి ఆకుల రసం , దిరిసెన ఆకురసం కలిపి తాగించిన క్రిములు నశిస్తాయి. తేనెటీగలు కుట్టినచోట దీని ఆకురసం అప్లై చేయడం వలన ఫలితం ఉంటుంది.
- తులసి దళం: అనేక ఔషధగుణాలున్నాయి. తేలు కుట్టినచోట తులసివేరుని పైనుంచి క్రిందికి పలుమార్లు తిప్పితే విషం దిగుతుందట. జలుబు, దగ్గు ఉపశమనానికి మంచి మెడిసిన్. వాతవ్యాధుల వలన దెబ్బతిన్న అవయవాలకు తులసి రసం అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకురసం తలకు పట్టించి కొంచంసేపటి తరువాత తలస్నానం చేసిన పేలు సమస్య తగ్గుతుంది.
- మామిడి ఆకులు: మామిడి చిగుళ్ల రసం తేనెతో కలిపి తీసుకుంటే పైత్యం హరిస్తుంది. మామిడి చెట్టు నుంచి కారు జిగురు కాలిపగుళ్ళకు అప్లై చేస్తే కాలిపగుళ్లు తగ్గుతాయి. మామిడి ఆకుల కషాయంలో తేనె కలిపి సేవించిన గొంతు పూడుకుపోయే సమస్య తగ్గుతుంది.
- గన్నేరు: దీని బెరడు గుండెజబ్బులకు , మూత్రవ్యాధు నివారణకు ఉపయోగిస్తారు . దీని వేరు అరగదీసిన గంధము చర్మవ్యాదులలో , కుష్టు మొదలగు వాటికి నివారణకు మంచి మెడిసిన్.
- విష్ణు కాంత: ఇది జ్వరం, కఫం, దగ్గు, తగ్గించడానికి, విరోచనాల నివారణకు, ఉబ్బస వ్యాధులను దూరం చేసేందుకు ఉపయోగపడుతుంది.
- దానిమ్మ: విరేచనాలలో రక్తం పడుతున్నా, నోరు రుచి తెలియని సమస్య ఉన్నా, నోటి నుంచి రక్తం పడుచున్నా, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్కు నుండి రక్తం కారడం, కండ్ల కలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు నివారణకు దానిమ్మని ఉపయోగిస్తారు.
- దేవదారు: దీని ఆకు క్రిమి సంహారముగా పనిచేస్తుంది. దీని బెరడు జ్వరాన్ని, విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- మరువం: ఇది సుగంధద్రవ్యపు మొక్క. కీళ్లనొప్పి, వాతం, కఫం వంటి వాటిని హరించును . తేలు, జెర్రి వంటి విష పురుగుల విషాన్ని హరిస్తుంది. విష జ్వరం హరిస్తుంది. హుద్రోగము , శ్వాస , శోషరోగాన్ని హరిస్తుంది. గజ్జి, చర్మరోగాలు నయం అవుతాయి.
- వావిలి: ఒళ్ళు నొప్పులు, చెవిలో చీము, పొట్లపాము , కట్లపురుగు కరిచిన వావిలి వేరు నీటితో నూరి తాగించిన విషము హరించును . జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, గాయాలు, చెవిపోటు, మూర్ఛ వ్యాధి, ప్రసవం తరువాత వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది.
- జాజి పత్రం: చెవిలో నుంచి చీము కారుతున్నా, స్త్రీలలో ఋతుక్రమం సరిగ్గా లేకున్నా వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయం వ్యాధులు, నోటి పూత, దుర్వాసన, కామెర్లు, చర్మ వ్యాధులు నుంచి ఉపశమనం కోసం జాజి పత్రం ఉపయోగిస్తారు.
- దేవ కాంచనం: ఆకు ముద్దగా నూరి కుష్ఠురోగపు మచ్చలపై వేసి కట్టిన మచ్చలు నయం అగును. మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు. నులి పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. ఎలుక విషమునకు దీని ఆకురసం మంచి మెడిసిన్.
- జమ్మి: దీనిని భస్మప్రక్రియలలో వాడతారు. కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.
- రావి: స్త్రీ , పురుషుల్లో సంతానోత్పత్తికి అద్బుతముగా పనిచేయును. మల బద్ధకం, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు నివారించడానికి ఉపయోగపడుతుంది. జీర్ణ శక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి సహకరిస్తుంది. చర్మవ్యాధులకు, సుఖవ్యాధుల నివారణకు, దీని పాలు పాదాల పగుళ్ళకు , చర్మపు పగుళ్లకు పనిచేయును .
- తెల్ల మద్ది: దీని బెరడు గుండె జబ్బులలో పనిచేస్తుంది. చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. వ్రణములపైన దీని ఆకులు వేసి కట్టు కట్టిన త్వరగా తగ్గుతుంది. క్షయ దగ్గు నివారణకు కూడా ఉపయోగిస్తారు.
- జిల్లేడు: వాతమును హరిస్తుంది. క్రిమిరోగములను , దుష్టవ్రణములను , శ్వాస , కాసలను హరిస్తుంది. చర్మ వ్యాధులు, సెగ గడ్డలు, కీళ్ళ నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మిర్లు, బోధకాలు , వ్రణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తేలు కుట్టిన ప్రదేశములో జిల్లేడు ఆకు మెత్తగా నూరి కట్టి గుగ్గిలం పొగవేస్తే విషం హరిస్తుంది.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే..































