గ్యాస్‌ గీజరే ముగ్గురి మృతికి కారణం!

www.mannamweb.com


సనత్‌నగర్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని జెక్‌కాలనీలో ఆదివారం బాత్రూంలో తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందడానికి గ్యాస్‌ గీజరే కారణమని భావిస్తున్నారు. అందులోని విషవాయువు కార్బన్‌ మోనాక్సైడ్‌ను పీల్చినందునే ముగ్గురు మరణించి ఉంటారని వైద్యుల ప్రాథమిక నిర్ధారణలో తేలిందని సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసులు తెలిపారు. సిగ్నోడ్‌ ట్రాన్సిస్ట్‌ ప్యాకింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థలో బిజినెస్‌ హెడ్‌గా పనిచేసే ఆర్‌.వెంకటేష్‌(59), ఆయన భార్య మాధవి(52), కుమారుడు హరికృష్ణ(25).. జెక్‌ కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని తమ ఫ్లాట్‌ బాత్రూంలో ఆదివారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. మానసిక స్థితి సరిగాలేని కుమారుడు హరికృష్ణకు స్నానం చేయించేందుకు బాత్రూంలోకి వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పక్క ఫ్లాట్‌కు చెందిన వారు ఊరెళ్తుండగా.. ఈ ముగ్గురు వీడ్కోలు చెప్పారు. తర్వాత కొన్ని నిమిషాలకే కుమారుడికి స్నానం చేయించడానికి తల్లిదండ్రులిద్దరూ బాత్రూంలోకి వెళ్లి తలుపులు పెట్టారు. గీజర్‌ నుంచి విడుదలైన కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చడంతో ఆ ముగ్గురూ స్పృహతప్పి క్షణాల్లోనే మరణించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.