కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలపై ఈ బడ్జెట్ లో వరాల జల్లు కురిపిస్తారని సమాచారం.
అయితే, బడ్జెట్ ప్రవేశపెట్టే కంటే ముందే సామాన్య ప్రజలకు శుభవార్త వచ్చింది. ప్రతీనెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. అయిల్ కంపెనీలు సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. ఈ క్రమంలో ఇవాళ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
తాజాగా నమోదైన వివరాల ప్రకారం.. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, గత పదకొండు నెలలుగా ఈ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకోవడం లేదు. గతేడాది మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం హోలీ సందర్భంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను ప్లాట్ రూ. 100 తగ్గించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సిలిండర్ ధరలో మార్పు కనిపించలేదు. తాజాగా.. 19కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర తగ్గింది. ఈ గ్యాస్ ను ఎక్కువగా హోటల్స్, రెస్టారెంట్స్ సహా ఇతర చోట్ల వినియోగిస్తుంటారు. తాజాగా నమోదైన ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.7 చొప్పున తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ 19కిలోల గ్యాస్ సిలిండర్ రేటు రూ. 1,804 నుంచి రూ. 1,797కు తగ్గింది.
తాజాగా తగ్గిన ధర ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో 19కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 1,797, కోల్ కతాలో రూ. 1907, ముంబైలో రూ. 1749.50, చెన్నైలో రూ. 1959.50, హైదరాబాద్ నగరంలో రూ. 2,023 వద్ద కొనసాగుతుంది. ఇదిలాఉంటే.. డొమెస్టిక్ (ఇంట్లో వినియోగించే) గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ ధర రూ. 803 వద్ద కొనసాగుతుంది. కోల్ కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50, హైదరాబాద్ లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 855 గా ఉంది.