ధవళేశ్వరంలో పదిలక్షల క్యూసెక్కులు దాటిన గోదావరి వరద ప్రవాహం,మొదటి హెచ్చరిక జారీ

www.mannamweb.com


Godavari warning: గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. వరద ఉధృతి పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 175 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వరద సహాయక చర్యల్లో 5SDRF, 4NDRF బృందాలు పాల్గొంటున్నాయి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 46.7అడుగులకు చేరింది. పోలవరం వద్ద 12.5 మీటర్లకు నీటిమట్టం దాటేసింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.50 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ఇది మరింత పెరగనుంది.

ఆదివారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.

ఎగువ నుంచి వస్తున్న వరద, భారీవర్షాల నేపధ్యంలో గోదావరికి వరద ప్రవాహం చేరుతున్నందున ముందస్తుగా ప్రభావితం చూపే జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో భారీ వర్షాలు,వరద ప్రభావిత జిల్లాలకు రెస్క్యూ , రిలీఫ్ ఆపరేషన్స్ కు మొత్తంగా 21.50కోట్లు నిధులు మంజూరు చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామని, వరద ఉధృతి ప్రభావం చూపే జిల్లాల అధికారులతో సమన్వయ పరుచుకుని సహాయక చర్యలకు మాడు ఎన్డీఆర్ఎఫ్ ( 1కోనసీమ, 1తూర్పుగోదావరి, 1అల్లూరి), మూడు ఎస్డీఆర్ఎఫ్ ( 2ఏలూరు, 1 అల్లూరి) బృందాలు పంపినట్లు అధికారులు తెలిపారు.

సహాయక బృందాల వెంట ఓబియమ్ బోట్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, రోప్స్, ఆస్కా లైట్ ఇతర రక్షణా పరికరాలతో సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని, బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.