Good News: మండే ఎండల్లో చల్లచల్లని కూల్ న్యూస్.. ఈసారి వర్షాలే వర్షాలు..

www.mannamweb.com


సూరీడు దంచికొడుతున్నాడు.. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచే భానుడు నిప్పులు కురిపిస్తూ మంటలు రేపుతున్నాడు. ఉదయం 10 గంటల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందంటే.. భానుడి ప్రతాపం ఎలా ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలు దాటాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు దగ్గర నమోదవుతాయన్న వాతావరణ శాఖ అంచనాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఐఎండీతోపాటు.. అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి సైతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో రాబోయే నెలల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని.. దాదాపు 25 కోట్ల మంది చిన్నారులకు భానుండి నుంచి ముప్పు పొంచి ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేసింది..

ఈ క్రమంలోనే.. భారత వాతావరణ శాఖ (IMD) రుతుపవనాలపై చల్లటి కబురు అందించింది. దేశంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు సమయానికి కంటే ముందే రావచ్చని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ సారి వర్షపాతం ఎక్కువగానే.. అంటే 106 శాతానిపైగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. హిందూ మహాసముద్రం డైపోల్, లా నినా పరిస్థితులు ఒకే సమయంలో చురుకుగా మారడంతో రుతుపవనాలు త్వరగానే వస్తాయని వాతావరణ నిపుణులు అంచనావేశారు. భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంపై అనుకూల దశను సూచిస్తున్న రుతు పవనాలు పసిఫిక్‌లో లానినా ఏర్పడటానికి సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తున్నాయని.. దీని ద్వారా వర్షాలు మంచిగానే కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..
2024 రుతుపవనాల సీజన్‌లో భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, లా నినా పరిస్థితులు ఆగస్టు-సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని IMD సోమవారం తెలిపింది. ఏది ఏమైనప్పటికీ, దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వర్షపు రోజుల సంఖ్య తగ్గుతోందని, అయితే భారీ వర్షాల సంఘటనలు (తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షాలు) పెరుగుతున్నాయని, ఇది తరచుగా కరువులు, వరదలకు దారితీస్తుందని చెప్పారు. 1951-2023 మధ్య డేటా ఆధారంగా, లా నినా ఎల్‌నినో సంఘటనను అనుసరించిన తొమ్మిది సందర్భాలలో రుతుపవన కాలంలో భారతదేశం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాన్ని చవిచూసిందని భారత వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీర్ఘకాల సగటు (87 సెం.మీ.)లో 106 శాతం సంచిత వర్షపాతం అంచనా వేసినట్లు ఆయన చెప్పారు.

కాగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.