ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ

ఏపీలో వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది.. బుధవారం ఒక్కరోజే ఆసరాకు రూ.1480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రూ.502 కోట్లు విడుదల చేశారు. అలాగే మిగిలిన పథకలకూ డబ్బుల్ని విడుదల చేయనున్నారు. అన్ని పథకాలకు రెండు మూడు రోజుల్లో నిధుల విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ డీబీటీ పథకాల నిధుల విడుదలకు సంబంధించి ఎన్నికల పోలింగ్‌కు ముందు ఉత్కంఠరేపింది. పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదలకు అనుమతి ఇవ్వాలని పోలింగ్‌కు రెండు, మూడు రోజులు ముందు ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే పోలింగ్‌కు ముందు పథకాలకు డబ్బులు విడుదల చేయడం సరికాదని ఈసీ చెప్పింది. ఎన్నికల ప్రక్రియ జూన్ 6తో ముగుస్తుందని.. అప్పుడు డబ్బులు విడుదల చేయొచ్చని తెలిపింది.
ఎన్నికల సంఘం డీబీటీ పథకాలకు డబ్బులు విడదుల చేయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో కొంతమంది లబ్ధిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మరోసారి ఈసీని కలిసి వినతి ఇవ్వాలని సూచించింది.. ప్రభుత్వం మరోసారి ఈసీని రిక్వెస్ట్ చేసినా అనుమతి ఇవ్వలేదు.. ఇప్పుడు అంత అత్యవసరం ఏముందని.. పోలింగ్ పూర్తైన తర్వాత నిధులు విడుదల చేయొచ్చని సూచించిది. ఈ క్రమంలో హైకోర్టులో మరోసారి విచారణ జరగ్గా.. నిధులు విడుదల చేసేందుకు ఒక్కరోజు అవకాశం కల్పించింది. అయితే ప్రభుత్వం ఈసీని మూడోసారి పథకాల డబ్బుల విడుదల చేసేందుకు అనుమతి కోరినా తిరస్కరించారు. దీంతో నిధుల విడుదలకాలేదు.. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో అకౌంట్లలో జమ చేశారు.