ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి స్త్రీ శక్తి పథకం ప్రారంభంకానుంది.. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించొచ్చు. స్త్రీశక్తి పథకం అమలుపై ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మహిళా ప్రయాణికులతో మర్యాదగా ఉండాలని ఉద్యోగులకు సూచించారు. ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత జీరో ఫేర్ టికెట్ల జారీ మొదలవుతుందని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులు చర్యలు తీసుకోవాలి అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా ఫిర్యాదులు రాకూడదని స్పష్టం చేశారు. ఆర్టీసీ సిబ్బందితో సమావేశాలు నిర్వహించి, జాగ్రత్తగా విధులు నిర్వహించేలా చూడాలని సూచించారు. గ్యారేజీ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని అన్నారు. ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని తెలిపారు. ఉద్యోగులు బాధ్యతగా పనిచేసి సంస్థకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
మహిళలకు ఉచిత ప్రయాణ పథకం నేటి నుంచి అమలు చేయనుండటంతో డ్రైవర్లు, కండక్టర్లకు డబుల్ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. అందుకే వారికిచ్చే డబుల్ డ్యూటీ డబ్బులు పెంచారు. డ్రైవర్లకు రూ.1,000, కండక్టర్లకు రూ.900 ఇస్తారు. ఆన్‌కాల్ డ్రైవర్లకు కూడా డబ్బులు పెంచారు. ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్లకు డబుల్ డ్యూటీ చేస్తే ఇంతకుముందు రూ.800 ఇచ్చేవారు.. కండక్టర్లకు రూ.700 ఇచ్చేవారు. ఇప్పుడు డ్రైవర్లకు రూ.1,000, కండక్టర్లకు రూ.900 ఇస్తారు. ఆన్‌కాల్ డ్రైవర్లకు రోజుకు రూ.800 ఉండగా.. ఇప్పుడు రూ.1,000కి పెంచారు.
స్త్రీ శక్తి పథకంలో భాగంగా.. మహిళల ఉచిత ప్రయాణ పథకం ఏ బస్సుల్లో అందుబాటులో ఉందో తెలిపేందుకు ఆర్టీసీ అధికారులు స్టిక్కర్లు అతికిస్తున్నారు. దీనివల్ల మహిళలు గందరగోళానికి గురికాకుండా ఉంటారు. ఏ బస్సు ఎక్కాలో సులువుగా తెలుస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉండే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉన్నాయి. వీటిని చూడగానే గుర్తుపట్టవచ్చు. కానీ ఎక్స్‌ప్రెస్, నాన్‌స్టాప్, ఇంటర్‌స్టేట్ ఎక్స్‌ప్రెస్ బస్సులు ఒకేలా ఉంటాయి. వీటిలో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. నాన్‌స్టాప్, ఇంటర్‌స్టేట్ బస్సుల్లో టికెట్ తీసుకోవాలి.
ఈ మూడు బస్సులు ఒకేలా ఉండటంతో మహిళలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఉచిత ప్రయాణం ఉన్న బస్సులపై “స్త్రీశక్తి పథకం వర్తిస్తుంది” అనే స్టిక్కర్లను అతికిస్తున్నారు. పథకం వర్తిస్తుంది అనే స్టిక్కర్ ఉంటే ఆ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. స్త్రీశక్తి పథకానికి సంబంధించి.. ఏడాదికి రూ.1,942 కోట్లు ఏపీ ప్రభుత్వంపై భారం పడుతోంది. ఆర్టీసీలోని 8,458 బస్సుల్లో (మొత్తం బస్సుల్లో 74 శాతం) ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. మహిళలు, యువతులు, థర్డ్ జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు.
































