దేశంలో పది కోట్ల మందికిపైగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహాన్ని నియంత్రించే క్రమంలో వారంతా రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.
ఒక్కరోజు మిస్ అయినా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునే సమయంలో అనేక మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, వారి ఇబ్బందులు తొలగించేందుకు అగ్రశ్రేణి ఫార్మా కంపెనీల్లో ఒకటైన సిప్లా లిమిటెడ్ పీల్చుకునే ఇన్సులిన్ పౌడర్ (Cipla launches inhalable insulin) ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
సిప్లా లిమిటెడ్ అఫ్రెజా పేరుతో ఇన్సులిన్ పౌడర్ విక్రయించడానికి గత ఏడాది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి అనుమతి తీసుకోగా.. ఇప్పుడు దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. మధుమేహ వ్యాధితో ఇబ్బంది పడుతూ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటున్న వారికి ఇది ఎంతో ఊరట కలిగించే అంశంగా చెబుతున్నారు.
పీల్చుకునే ఇన్సులిన్ పౌండర్ ను సింగిల్ డోస్ క్యాట్రిడ్జ్ రూపంలో సిప్లా అందిస్తోంది. ఇన్హేలర్ మాదిరిగా ఉన్న పరికరంలో క్యాట్రిడ్జ్ను అమర్చి నోటి ద్వారా పీల్చుకోవాలి. ఆ తరువాత ఇన్హేలర్ నుంచి క్యాట్రిడ్జ్ను తొలగించాలి. మధ్యాహ్న భోజనం తరువాత ఇన్సులిన్ పౌడర్ పీల్చుకుంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది.
సిప్లా లిమిటెడ్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అచిన్ గుప్తా మాట్లాడుతూ.. ప్రతి రోగికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడం మా ఉద్దేశం. ఈ క్రమంలో భారతదేశంలో అఫ్రెజాను పరిచయడం చేయడం మా బాధ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ ఆవిష్కరణ ఇన్సులిన్ డెలివరీని సులభతరం చేయడమే కాకుండా.. రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్లతో ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను తొలగిస్తుందని చెప్పారు.


































