శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా అలిపిరిలోనే భారీ టౌన్షిప్ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు.
దీని ద్వారా కొండపై గదుల దొరక్క పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఈ టౌన్ షిప్ లోనే భారీ వసతితో పాటుగా టికెట్ కౌంటర్లు.. కొండ మీదకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించనున్నారు. ఈ టౌన్ షిప్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయి.
తిరుమల క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు ఇది నిజంగా శుభవార్తే. కొండపై గదుల దొరక్క పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి పాదాల చెంత భారీ టౌన్షిప్ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. తిరుమల కొండపై స్థలాభావం ఉండటంతో కిందనే భారీ వసతి సముదాయం నిర్మించా లని బోర్డు నిర్ణయించింది. అలిపిరిలో ప్రస్తుతం ఉన్న శిల్ప కళాశాలను మరో చోటుకు తరలి స్తారు. అక్కడ ఖాళీ అయ్యే సుమారు 20 నుంచి 25 ఎకరాల విశాలమైన స్థలంలో మెగా టౌన్షిప్ నిర్మిస్తారు. ఇందులో ఏకంగా 20 వేల మందికి పైగా భక్తులకు ఒకేసారి వసతి కల్పించేలా ఏర్పాట్లు ఉంటాయి. గదులే కాదు, భక్తులకు అవసరమైన రవాణా సౌకర్యం, అన్నప్రసాద కేంద్రం, యాత్రికుల సముదాయం (పీఏసీ) వంటివన్నీ ఇక్కడే ఉంటాయి.
కాగా, విజన్ -2047 మేరకు ఈ నిర్మాణ ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. ఈ నిర్మాణం సాధారణంగా ఉండదు. ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్‌లతో (వరల్డ్ క్లాస్ అర్చిటెక్ట్స్) దీనికి ప్రణాళికలు సిద్ధం చేయించనున్నారు. తిరుమల వచ్చే భక్తులు ఇక్కడ బస చేసి, స్వామివారి దర్శనానికి వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ టౌన్ షిప్ ద్వారా వసతి కల్పించటం ద్వారా తిరుమలలో గదుల కేటాయింపు పైన ఒత్తిడి తగ్గనుంది. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి చేరే ప్రైవేట్ వాహనాలను ఈ బేస్‌క్యాంప్‌కు మళ్లించి వాటిలో వచ్చిన భక్తులను టీటీడీ, ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా తిరుమలకు పంపేందుకు ప్రత్యేక కేంద్రం.. మోడల్ ట్రాన్స్ఫర్ టెర్మినల్ ఏర్పాటు చేస్తారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు, స్నానాలు చేసేందుకు, భోజనం హాళ్లు, లాకర్లు వంటి సదుపాయాలు కల్పిస్తారు. ఈ బేస్‌క్యాంప్ అందుబాటులోకి వస్తే కొండపై వాహన కాలుష్యం తగ్గించడంతో పాటు నీటి, విద్యుత్ వినియోగాన్ని సమర్థంగా నియంత్రించవచ్చని టీటీడీ భావిస్తోంది.


































