ఏపీలో గ్రామీణ పేదలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ (పీఎంఏవై-జీ) పథకం కింద గ్రామాల్లోని పేదలకు ఇళ్ల కేటాయింపు కోసం ఇప్పటికే దరఖాస్తుల్ని స్వీకరించిన ప్రభుత్వం..
వీటిపై మరో అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో భాగంగా గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కీలక ప్రకటన చేశారు.
దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఇళ్లు లేని పేదలకు సొంత ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ పథకం కోసం ఇప్పటికే ప్రభుత్వం సర్వే పూర్తి చేసింది. గతంలో ఓసారి గడువు ముగిసినా రాష్ట్రం విజ్ఞప్తితో గడువు పొడిగించారు. ఈ మేరకు గ్రామాల నుంచి ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం 10.42 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అజయ్ జైన్ ప్రకటించారు. ఇందులో అర్హులకు ఇళ్ల కేటాయింపు ఎప్పుడు ఉంటుందో కూడా వెల్లడించారు.
కేంద్రం రాష్ట్రం నుంచి వచ్చిన 10.42 లక్షల ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి వచ్చే ఫిబ్రవరి నెలలో (ఫిబ్రవరి 2026) కేటాయించబోతున్నట్లు అజయ్ జైన్ వెల్లడించారు. 2029 కల్లా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల కేటాయింపు చేయాలన్న కూటమి సర్కార్ లక్ష్యంలో భాగంగా ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో త్వరలోనే గ్రామీణ పేదలకు ఈ ఇళ్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక 3.10 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించారు. అలాగే మరో 5.68 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. వచ్చే ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం టార్గెట్లు కూడా పెట్టింది. వీటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. దీంతో రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి.



































