ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్యకారులకు శుభవార్త. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి మరో మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
ఇక ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు.
52 లక్షల రూపాయల విలువైన బోట్లు అందించనున్న సర్కార్
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మత్స్యకారులకు సాంప్రదాయ వలలు పంపిణీ చేసి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రభుత్వం 52 లక్షల రూపాయల విలువైన ఇంజన్లతో కూడిన బోట్లను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది మత్స్యకారుల యొక్క వేటాడే సామర్థ్యాన్ని బాగా పెంచుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
మత్స్యకారులకు సబ్సిడీపై ఆటోలు
ప్రభుత్వ మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకువస్తుందని చెప్పిన ఆయన మత్స్యకారులకు 40 శాతం సబ్సిడీతో ఆటోలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఉదాహరణకు రెండు లక్షల రూపాయల విలువైన ఆటో కొనుగోలు పైన 80 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. గతంలో మత్స్యకారుల కుటుంబాలకు 4500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తే, ప్రస్తుతం వేటకు వెళ్లే మత్స్యకారులకు 20 వేల రూపాయలకు అది పెంచామని పేర్కొన్నారు.
50 ఏళ్ళకే మత్స్యకారులకు పెన్షన్
మత్స్యకారులకు 50 సంవత్సరాలు వయసు నిండిన తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్రం సహకారంతో మత్స్యకారులకు రాయితీ పైన వివిధ రకాల పరికరాలను అందిస్తున్నామని, అందులో భాగంగానే ఇంజన్లు, తెప్పలు, వలలు, పడవలు వంటివి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన మత్స్యకారులు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
మత్స్యకారులకు రాయితీ పైన వివిధ రకాల పరికరాలు
ఈ పథకంలో భాగంగా ఓబిసి వర్గాలకు 40% రాయితీ లభిస్తుందని, ఎస్సీ ఎస్టీ వర్గాలకు 60 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తుంది. రాయితీ క్రింద వేటకు సంబంధించిన సబ్సిడీ పరికరాలు పొందాలి అంటే మత్స్యకారులకు సొంత బోటుతో పాటు సంబంధిత లైసెన్సు తప్పనిసరి. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని మత్స్యకారులు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.


































