ఏపీలో వారికి గుడ్ న్యూస్.. కొత్త పింఛన్లు.

పేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. డిసెంబర్ నెలకు సంబంధించి 8190 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు కింద దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే.


ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పింఛన్ కోరుతూ వచ్చిన పెండింగ్ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం.. అర్హత కలిగిన వారికి కొత్తగా పింఛన్లు ఆమోదించినట్లు సమాచారం . డిసెంబర్ 1వ తేదీ నుంచి 8190 మందికి కొత్త పింఛన్లు అందించనున్నారు. మరోవైపు డిసెంబర్ నెల పింఛన్ల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 2,738.71 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

చంద్రబాబు ఏలూరు పర్యటన

మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెలా లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలా రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తున్న సీఎం.. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి చేతికి పింఛన్ సొమ్ము అందిస్తున్నారు. అలాగే వారి కుటుంబం బాగోగులు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ ఒకటో తేదీ ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. ఈ షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ ఒకటో తేదీ ఉంగుటూరు మండలంలోని గొల్లగూడెం, గోపీనాథపట్నంలో చంద్రబాబు పర్యటిస్తారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీతో పాటుగా ప్రజా వేదిక కార్యక్రమం, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు.

ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో గొల్లగూడెం చేరుకోనున్న చంద్రబాబు..అక్కడి నుంచి నేరుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గుడ్ల నాగలక్ష్మి అనే మహిళ ఇంటికి వెళ్తారు. ఆమెకు పింఛన్ అందజేస్తారు. అనంతరం నల్లమాడులో జరిగే ప్రజా వేదిక కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.పింఛన్ల పంపిణీ మార్గదర్శకాలు

మరోవైపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సంబంధించి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రతి నెల మాదిరిగానే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ మొత్తం అందిస్తారు. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీలో భాగంగా లబ్ధిదారుల వివరాలను రియల్-టైమ్‌లో సేకరించడంతో పాటుగా అనర్హుల జాబితా గుర్తించాలని, కొత్త దరఖాస్తుల పరిశీలన సహా.. బోగస్ దివ్యాంగ సర్టిఫికెట్లపై చర్యలు వంటి అంశాల మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.