ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకులు సందర్శించేందుకు ఆధ్యాత్మిక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. నిత్యం తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
అయితే, శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్త తీసుకొచ్చింది. జులై నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడి అధికారులు తెలిపారు. ఈనెల18వ తేది ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చని అన్నారు.
ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు.అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను కూడా విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వివరించారు.
ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల..
ఇక, ఈ నెల 23న ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు కూడా భక్తులకు అందుబాటులో ఉండనున్నట్లు టీటీడీ పేర్కొంది. అదే రోజు ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. వీటితో పాటు ప్రత్యేక దర్శన టిక్కెట్లను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు 300 రూపాయలతో భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు గురువారం (ఏప్రిల్ 11) రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ ఎంతో వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇక, ఈ వాహనసేవ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో పార్థసారధి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణభట్టర్ సీతారామాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి సేవ కోటా విడుదల..
ఇక, ఈనెల 27వ తేది ఉదయం పదకొండు గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 27 వ తేది మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారని అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు, తిరుమల శ్రీవారి భక్తులు శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆలయ వెబ్‌సైట్‌ను https://ttdevasthanams.ap.gov.in సందర్శించొచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.