వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే న్యూ ఫీచర్లు

వాట్సాప్ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా ‘మిస్డ్ కాల్ మెసేజ్లు’ అనే ఫీచర్ను తీసుకొచ్చింది.


ఇది పాతకాలపు వాయిస్మెయిల్కు ఆధునిక ప్రత్యామ్నాయంగా వచ్చింది. ఇకపై మీరు ఎవరికైనా వాయిస్ లేదా వీడియో కాల్ చేసినప్పుడు వారు అందుబాటులో లేకపోతే వెంటనే ఒకే ట్యాప్తో వారికి వాయిస్ నోట్ లేదా వీడియో నోట్ను మెసేజ్గా పంపవచ్చు. ఈ నోట్ నేరుగా మీ చాట్లో రికార్డ్ అవుతుంది. దీనివల్ల కాల్ మిస్ అయినప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని తక్షణమే తెలియజేయడానికి ఈజీ అవుతుంది. అలాగే గ్రూపులలో జరిగే వాయిస్ చాట్లలో ఇకపై సభ్యులు తమ మాటలకు అడ్డు కలగకుండా ఉండేందుకు ‘రియాక్షన్స్’ పంపే అవకాశం కల్పించారు. దీనితో పాటు గ్రూప్ వీడియో కాల్స్లో మాట్లాడుతున్న వ్యక్తిని ఆటోమేటిక్గా హైలైట్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవడం మరింత తేలిక అవుతుంది.

యూజర్లకు ఈజీగా ఉండేందుకు..

వాట్సాప్ ఇప్పుడు తన మెటా ఏఐ ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరిచింది. ఇందులో భాగంగా మిడ్జర్నీ, ఫ్లక్స్ వంటి అత్యాధునిక మోడల్స్ టెక్నాలజీని వాడుకోవడం వల్ల టెక్స్ట్ ఆధారంగా తయారయ్యే ఏఐ చిత్రాల నాణ్యత, స్పష్టత చాలా మెరుగయ్యాయి. ముఖ్యంగా పండుగల సందర్భంగా శుభాకాంక్షలు పంపేందుకు లేదా సరదా గ్రాఫిక్స్ రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ అప్డేట్లో మరో ఆకర్షణీయమైన ఫీచర్ ఏమిటంటే మీరు పంపిన లేదా స్టేటస్లో పెట్టిన సాధారణ ఫోటోలను కూడా చిన్న వీడియో క్లిప్గా యానిమేట్ చేసే సామర్థ్యం ఉంది. మీరు కేవలం ప్రాంప్ట్ ఇస్తే, ఏఐ దాన్ని కదిలే చిత్రంగా మార్చుతుంది. ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

అలాగే స్టేటస్ అప్డేట్లలో కూడా కొత్త మార్పులు వచ్చాయి. యూజర్లు తమ స్టేటస్లలో ఇప్పుడు మ్యూజిక్ లిరిక్స్, ఇంటరాక్టివ్ స్టిక్కర్లు, ఇతరులు స్పందించడానికి వీలుగా ప్రశ్నలు అడిగే ఫీచర్లను జోడించుకోవచ్చు. ఛానెల్స్లో అడ్మిన్లు తమ ఫాలోవర్లతో మరింత సమర్థవంతంగా మాట్లాడేందుకు, ప్రశ్నలు అడగడం ద్వారా రియల్ టైంలో స్పందనలు పొందేందుకు వీలు కలిగించారు. ఇక డెస్క్టాప్ యూజర్ల కోసం, అన్ని డాక్యుమెంట్లు, లింకులు, మీడియా ఫైళ్లను ఒకే చోట సులభంగా వెతికేందుకు నిర్వహించేందుకు కొత్త మీడియా ట్యాబ్ను తీసుకొచ్చారు. అలాగే చాట్లలో షేర్ చేసే పెద్ద పెద్ద లింకుల ప్రివ్యూలను మరింత స్పష్టంగా, చిందరవందరగా లేకుండా కనిపించేలా మెరుగుపరచడం జరిగింది. ఈ అన్ని ఫీచర్లను హాలిడే సీజన్ సందర్భంగా అందుబాటులోకి తీసుకొచ్చామని వాట్సాప్ తెలిపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.