ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.1500.. పత్రాలు రెడీ చేసుకోండి!
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో తామిచ్చిన హామీలను అమలు చేసేదిశగా అడుగులు వేస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెంచిన పింఛనును ప్రారంభించగా, డీఎస్సీ ప్రకటన వెలువడింది. ఉచితంగా ఇసుక ఇవ్వడం, నైపుణ్య గణన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటిన్లపై వరుసగా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు తాజాగా మరో కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఇది కూడా ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన పథకమే.
18 ఏళ్లు నిండి ఉండాలి
ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిలకు నెలకు రూ.1500 ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా త్వరలోనే మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వబోతున్నారని, దీనికి సంబంధించి అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలనే ఆ వార్త సారాంశం.
ప్రతి స్త్రీకి 18 సంవత్సరాల వయసు నిండాలని, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జన్మించిన తేదీకి సంబంధించిన ధ్రువపత్రం, ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ కలిగివుండాలి. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని వచ్చేనెల నుంచి అమలు చేయబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఎప్పుడు ప్రారంభించాలనే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.
ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్
ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. అందులో ఆడబిడ్డ నిధి కూడా ఉంది. 18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇవ్వనున్నారు. దీనివల్ల ప్రతి కుటుంబంలో నిత్యావసరాలను కొనుగోలు చేసే బాధ తప్పుతుందని స్త్రీలు భావిస్తున్నారు. నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఈ రూ.1500 తోనైనా కాస్తంత ఊపిరి పీల్చుకోవచ్చని మహిళలు భావిస్తున్నారు. ఆడబిడ్డ పథకం కింద అందించే రూ.1500ను ప్రతి నెలా డీబీటీ పద్ధతిద్వారా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో వేస్తారు.