2030 నాటికి ఏఐకి మానవ తెలివితేటలు.. మానవాళికి ముప్పు : గూగుల్‌ అంచనా

ప్పుడు ఎక్కడ చూసినా అంతా ఏఐ (Artificial Intelligence) మాయే. ప్రతి రంగంలోనూ ఇది విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ మానవ జీవితాలను మార్చివేస్తోంది. దీనివల్ల మానవాళికి ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ.. అంతేమేర నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ స్థాయి కృత్రిమ మేధస్సుగా పిలిచే ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌(Artificial General Intelligence) 2030 నాటికి వస్తుందని.. ఇది మానవాళిని శాశ్వతంగా నాశనం చేస్తుందని గూగుల్‌ డీప్‌మైండ్‌ (Google DeepMind ) కొత్త పరిశోధన అంచనా వేసింది.


ఏజీఐ (AGI) భారీ ప్రభావం దృష్ట్యా.. ఇది కూడా తీవ్రమైన హాని కలిగించే ప్రమాదం ఉందని తాము అంచనా వేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. మానవాళిని నాశనం చేసే ప్రమాదాలు ఉన్నాయని ఈ పరిశోధనలో హెచ్చరించారు. అధునాతన ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను ఈ అధ్యయనం పలు కేటగిరీలుగా విభజించింది. డేటాను దుర్వినియోగం చేయడం, తప్పులు, తప్పుగా పొందుపరచడం, స్ట్రక్చరల్‌ రిస్క్స్‌లాంటి ముప్పులు ఉన్నాయని పేర్కొంది.

డీప్‌మైండ్‌ (DeepMind) సహ వ్యవస్థాపకుడు షేన్‌లెగ్‌ సహ రచయితగా ఉన్న ఈ అధ్యయనం.. మానవాళికి ఏ రకంగా హాని చేస్తుందన్న విషయాలను స్పష్టంగా చెప్పలేదు. అయితే.. ఏజీఐ ముప్పును తగ్గించడానికి గూగుల్‌, ఇతర ఏఐ కంపెనీలు తీసుకోవాల్సిన నివారణ చర్యలను సూచించింది.

మానవుల కంటే తెలివైన ఏజీఐ రాబోతోందని గత ఫిబ్రవరిలోనే డీప్‌మైండ్‌ సీఈవో డెమిస్‌ హస్సాబిస్‌ తెలిపాడు. రాబోయే ఐదు లేదా పదేళ్లలో ఇది ఉద్భవిస్తుందని పేర్కొన్నాడు. ఏజీఐ పర్యవేక్షణపై ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థల తరఫున ఆయన పోరాడుతున్నారు.

ఏంటీ ఏజీఐ
ఏఐకి మరో ముందడుగే ఈ ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌. ఏఐ అనేది టాస్క్‌ స్పెసిఫిక్‌గా ఉండగా.. ఏజీఐ అనేది మానవ మేధస్సు మాదిరిగానే విస్తృత శ్రేణి పనులకు అన్వయించగల మేదస్సును కలిగి ఉండేలా లక్ష్యాలను పెట్టుకుంటుంది. ఏజీఐ అనేది మనుషుల్లానే.. విభిన్న డొమైన్‌లలో జ్ఞానాన్ని అర్ధం చేసుకునే, నేర్చుకునే, అన్వయించగల సామర్థ్యం ఉన్న యంత్రం.