ప్రభుత్వ బ్యాంకు కొత్త పథకం.. అద్భుతమైన ప్రయోజనాలు.. రూ.5 లక్షల బీమా

ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన.. యూనియన్ బ్యాంక్ ‘యూనియన్ వెల్‌నెస్ డిపాజిట్’ పేరుతో కొత్త టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఇది 375 రోజుల కాలవ్యవధితో 6.75 శాతం వడ్డీ రేటును, రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవర్‌ను అందిస్తుంది. సీనియర్ సిటిజన్‌లకు 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 10 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. వినియోగదారుల కోసం సరికొత్త, వినూత్నమైన టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. అదే ‘యూనియన్ వెల్‌నెస్ డిపాజిట్’. 2025, మే 13న ముంబైలో అధికారికంగా ఈ పథకం ప్రారంభమైంది. సంపద సృష్టితో పాటు ఆరోగ్య రక్షణను కూడా అందిస్తూ వినియోగదారులకు సమగ్ర ఆర్థిక పరిష్కారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.


FD, హెల్త్ ఇన్సూరెన్స్..

సాధారణ డిపాజిట్ల మాదిరిగా కాకుండా, యూనియన్ వెల్‌నెస్ డిపాజిట్ టర్మ్ డిపాజిట్‌తో పాటు సూపర్ టాప్-అప్ ఆరోగ్య బీమా పాలసీని కూడా కలిగి ఉంది. అదనంగా, ఉచిత రూపే సెలక్ట్ డెబిట్ కార్డ్ ద్వారా లైఫ్‌స్టైల్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, 375 రోజుల సూపర్ టాప్-అప్ ఆరోగ్య బీమా కవర్, ఇది రూ 5 లక్షల మొత్తానికి నగదు రహిత ఆసుపత్రి సౌకర్యాలను (క్యాష్ లెస్ ట్రీట్మెంట్) అందిస్తుంది.

యూనియన్ వెల్‌నెస్ డిపాజిట్‌లో ఎవరు పెట్టుబడి పెట్టొచ్చు?

యూనియన్ వెల్‌నెస్ డిపాజిట్ పథకం 18- 75 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ నివాసితులకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా అకౌంట్లు తెరవొచ్చు. అయితే ఉమ్మడి ఖాతాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ప్రైమరీ అకౌంట్ హోల్డర్‌కు మాత్రమే వర్తిస్తుంది. డిపాజిట్ మొత్తం రూ. 10 లక్షల నుంచి రూ. 3 కోట్ల మధ్య ఉండాలి.

ఆకర్షణీయమైన వడ్డీ రేటు..

ఈ డిపాజిట్ 375 రోజుల స్థిర కాలవ్యవధితో వస్తుంది. సంవత్సరానికి ఆకర్షణీయమైన 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం ప్రయోజనం లభిస్తుంది. వారి వార్షిక వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంటుంది.

చివరగా.. ఈ పథకం డిపాజిట్‌ను ముందుగా మూసివేయడానికి, రుణాలు తీసుకోవడానికి కూడా అనుమతిస్తుంది. దీంతో రాబడితో పాటు నగదు లభ్యతను కూడా అందిస్తుంది. ముఖ్యంగా, రూ. 5 లక్షల మొత్తానికి 375 రోజుల సూపర్ టాప్-అప్ ఆరోగ్య బీమా కవర్, నగదు రహిత ఆసుపత్రి సౌకర్యం ఈ పథకానికి ప్రత్యేక ఆకర్షణ.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.