రిటైర్డ్‌ హెచ్‌ఎం ప్రాణం తీసిన ప్రభుత్వ వైఫల్యం

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా చేసేందుకు జీవితాంతం శ్రమించాడు ఓ ప్రధానోపాధ్యాయుడు.


చదువుకుంటే కష్టాలు తొలగిపోతాయని, చదువుతోటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని హితబోధ చేస్తూ విద్యార్థులకు పాఠాలు నేర్పాడు. కానీ ప్రభుత్వ వైఫల్యం కారణంగా అతడి విశ్రాంత జీవితం మానసికంగా వేదనాభరితమైంది. అనారోగ్యానికి గురైన వేళ మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాడు. చివరికి ఉద్యోగ విరమణ ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో అందించకపోవడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి మనోవేదనతో ప్రాణాలు వదిలాడు.

ఆయనే ఖమ్మం జిల్లాకు చెందిన కూరపాటి పాండురంగయ్య. ఖమ్మం జిల్లా ఏన్కూరులోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన కూరపాటి పాండురంగయ్య.. నిరుడు జూలైలో ఉద్యోగ విరమణ పొందాడు. ఇప్పటి తొమ్మిది నెలలు గడిచినా ఇంకా అతడికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం అందించలేదు. అప్పటికే అనారోగ్యం భారిన పడిన ఆయన.. తీవ్ర మనోవేదనతో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఖమ్మం శ్రీనగర్‌ కాలనీలోని తన నివాసంలో ఉన్న అతడి భౌతికకాయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వ వైఫల్యమే పాండురంగయ్య మృతికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మానసిక ఒత్తిడితో..

రిటైర్మెంట్‌ అనంతరం ప్రభుత్వం నుంచి తన బెనిఫిట్స్‌ వస్తాయన్న నమ్మకంతో ఖమ్మంలోని తన ఇంటిపైన మరో అంతస్తు నిర్మాణం చేపట్టారు. 9 నెలలైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ఉద్యోగ విరమణ ప్రయోజనాలను అందించకపోవడంతో ఒత్తిడికి గురయ్యాడు. ఆ ఒత్తిడి అతడి ఆరోగ్యంపై ప్రభావం చూపింది. చివరికి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతడి భార్య నిర్మల కూడా టీచర్‌గానే పనిచేస్తున్నారు. కాగా, పాండురంగయ్య.. కూసుమంచి, చింతకాని, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లో పనిచేశారు. యూటీఎఫ్‌లో అనేక బాధ్యతలు నిర్వర్తించారు.

బెనిఫిట్స్‌ అందకనే ఒత్తిడికి లోనయ్యాడు..

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందకపోవడం వల్ల అనేకమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రశాంత జీవనం గడపలేకపోతున్నారు. పాండురంగయ్య కూడా కేవలం రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందకపోవడం వల్లనే ఒత్తిడికి గురై తనువు చాలించాడు. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌, జీపీఎఫ్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ వంటి ప్రయోజనాలను ప్రభుత్వం అందించకపోవం వల్ల తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.