తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుంది, ఏపీకి విలన్ – సాయిరెడ్డి సంచలనం..!!

రాజ్యసభ వేదికగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ విభజన ద్వారా తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ ఆశించిందన్నారు. పదేళ్ల తరువాత అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు.
త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు.


కీలక వ్యాఖ్యలు

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అదృశ్యమైందని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసిందన్నారు .రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీని ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌ కనుమరుగవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ ఉన్నంత కాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి కాంగ్రెస్‌ చేసిందేమీ లేదన్నారు. కుటుంబ విషయాల్లో కాంగ్రెస్‌ జోక్యం చేసుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనం ఆశించినా నెరవేరలేదన్నారు. పదేళ్ల తరువాత అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. త్వరలోనే అక్కడి ప్రభుత్వం పడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

హోదా పై మోసం చేసారు

2019లో రాహుల్‌ గాంధీ అమేధిలో ఓడిపోయారని గుర్తు చేశారు. 2024లో ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమన్నారు. మిత్రపక్షాలే కాంగ్రెస్‌ను నమ్మడం లేదని, 2029 నాటికి కాంగ్రెస్‌ ముక్త భారత్‌ తథ్యమని జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో కాంగ్రెస్ కంటి తుడుపు హామీ ఇచ్చిందని మండిపడ్డారు. ఏపీపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా పొందుపరిచేందుకు ఎందుకు విస్మరించారని నిలదీసారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చడంలో ఫెయిల్ అయ్యారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశమే లేదన్నారు. ఇప్పుడు దీన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఏపీ కాంగ్రెస్ బాధిత రాష్ట్రం

ఏపీ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని సాయిరెడ్డి మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రంగా పేర్కొన్నారుఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో కచ్చితంగా చెప్పారని గుర్తు చేసారు. ఏపీ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గౌరవించడం లేదన్నారు. కుటుంబం వ్యవహారంలో తలదూర్చడం కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ కు ఉదాహరణగా సాయిరెడ్డి పరోక్షంగా షర్మిల అంశం ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశం ఎప్పుడూ ముందుకు వెళ్ళలేదని సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం పైన సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.