భారతదేశ ఆటోమొబైల్ రంగంలో జీఎస్టీ 2.0 (GST 2.0) సంస్కరణలు ఒక విప్లవాన్నే సృష్టించాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అత్యంత చేరువలో ఉండే చిన్న కార్ల (4 మీటర్ల లోపు) విభాగంపై ప్రభుత్వం పన్ను భారాన్ని భారీగా తగ్గించింది.
సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం.. గతంలో ఉన్న 28 శాతం జీఎస్టీని ఇప్పుడు 18 శాతానికి కుదించారు.
దీనివల్ల సాధారణ షోరూమ్ ధరలు తగ్గడమే కాకుండా, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పనిచేసే సైనికులకు అందించే ఆర్మీ క్యాంటీన్ (CSD) ధరలు మరింత పడిపోయాయి. ఈ నేపథ్యంలో భారతదేశపు మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి స్విఫ్ట్ ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత చౌక ధరకే లభిస్తోంది.
సాధారణంగా ఆర్మీ క్యాంటీన్లలో (Canteen Stores Department) అమ్ముడయ్యే వస్తువులపై సగం పన్ను రాయితీ ఉంటుంది. అంటే సివిల్ మార్కెట్లో పన్ను 18 శాతానికి తగ్గితే, క్యాంటీన్లో అది కేవలం 14 శాతంగానే ఉంటుంది. ఈ మార్పుల వల్ల మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలపై భారీ ప్రభావం పడింది.
కార్స్24 తాజా నివేదిక ప్రకారం.. స్విఫ్ట్ బేస్ మోడల్ అయిన LXI ధర ఇప్పుడు క్యాంటీన్లో కేవలం రూ. 5.07 లక్షలకే లభిస్తోంది. బయటి మార్కెట్లో దీని ధర రూ. 6.49 లక్షలుగా ఉండగా, సైనికులకు దాదాపు రూ. 1.42 లక్షల మేర ఆదా అవుతోంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ల విషయానికి వస్తే లాభం మరింత పెరుగుతోంది.
వేరియంట్ల వారీగా చూస్తే.. స్విఫ్ట్ VXI మోడల్ షోరూమ్ ధర రూ. 7.29 లక్షలు కాగా, క్యాంటీన్లో రూ. 5.74 లక్షలకే లభిస్తోంది. అలాగే ZXI మోడల్ మీద రూ. 1.68 లక్షలు, ZXI+ మీద రూ. 1.76 లక్షల వరకు రాయితీ లభిస్తోంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (AMT) ఇష్టపడే వారికి కూడా ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
ZXI+ AMT టాప్ వేరియంట్ బయట రూ. 9.49 లక్షలు ఉంటే, క్యాంటీన్లో కేవలం రూ. 7.60 లక్షలకే దొరుకుతుంది. అంటే ఒక కారు కొనుగోలుపై గరిష్టంగా రూ. 1.89 లక్షల వరకు పొదుపు చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 34 సీఎస్డీ డిపోల ద్వారా అర్హులైన వారు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
కొత్త తరం మారుతి స్విఫ్ట్ కేవలం ధరలోనే కాదు, ఫీచర్ల పరంగా కూడా అదరగొడుతోంది. ఇందులో కొత్తగా రూపొందించిన 1.2 లీటర్ Z2E 3-సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 80 bhp శక్తిని, 112 Nm టార్క్‌ను అందిస్తుంది. ముఖ్యంగా మైలేజీ విషయంలో ఈ కారు రికార్డులు సృష్టిస్తోంది.
మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.80 కి.మీ, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 25.75 కి.మీ, CNG వేరియంట్ ఏకంగా కిలోకు 32.85 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 9 అంగుళాల స్మార్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్, వెనుక ఏసీ వెంట్స్ వంటి మోడ్రన్ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి.ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ వస్తాయి.
అయితే, ఈ సీఎస్డీ (CSD) ప్రయోజనాలు కేవలం భారత సాయుధ దళాలలో పనిచేస్తున్న వారికి, రిటైర్డ్ సైనికులకు, వారి వితంతువులకు, రక్షణ రంగ పౌర ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. ఈ రాయితీలు వ్యక్తిగత ఉపయోగం కోసం ఉద్దేశించినవి కాబట్టి, క్యాంటీన్ ద్వారా కొన్న కార్లను ఒక నిర్ణీత కాలపరిమితి వరకు బయట మార్కెట్లో తిరిగి అమ్మడానికి వీలుండదు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. తక్కువ పన్నుతో లభించే ఈ వాహనాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ కండిషన్లు పెట్టారు. కారు కొనాలని ప్లాన్ చేస్తున్న మీ సైనిక మిత్రులకు ఈ గుడ్ న్యూస్ తెలియజేయడం మర్చిపోకండి.


































