పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రమాదంలో ఆయన చనిపోయారా? లేక ఎవరైనా ప్రాణాలు తీశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాజమండ్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోగా.. హైదరాబాద్ లో అంత్యక్రియలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఊరు ఎక్కడ? ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? అన్న అంశంపై చర్చ సాగుతోంది. అయితే.. ప్రవీణ్ స్వస్థలం కడప. స్థానిక రాజారెడ్డి వీధిలో ఆయన కుటుంబం నివాసం ఉండేది. పట్టణంలోని CSI స్కూల్‌లో ప్రవీణ్ విద్యాభ్యాసం సాగింది.. అక్కడే ఇంటర్ పూర్తి చేశారు ఆయన.
పేరెంట్స్ ది ప్రేమ వివాహం…
ప్రవీణ్ తల్లిదండ్రులది ప్రేమ వివాహమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తల్లి మరియమ్మ పశు సంవర్ధక శాఖలో ఉద్యోగి కాగా.. తండ్రి ముస్లిం. చిన్న నాటి నుంచే క్రైస్తవ మతం పట్ల ఇష్టం పెంచుకున్నారు ప్రవీణ్. సోదరుడితో గొడవ కారణంగా ఆయన హైదరాబాద్‌కు షిఫ్ట్ అయినట్లు సమాచారం. పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ఆయన అధిపతి అని తెలుస్తోంది. అయితే.. కొన్ని రోజులుగా ప్రవీణ్ కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
ప్రవీణ్ వందల కోట్లతో సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని సమాచారం. వందల మంది అనాథలను ఆయన చేరదీశారని చెబుతున్నారు. తన పిల్లల్లానే అనాథలకు చదువులు చెప్పిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ద్వారా లబ్ధిపొందిన వందలాది మంది కడచూపు కోసం తరలివచ్చారన్న చర్చ సాగుతోంది.