Health: భారత్‌లో గుండె సమస్యలు అందుకే ఎక్కువ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోందంటే

www.mannamweb.com


ఒకప్పుడు గుండె సంబంధిత సమస్యలు అంటే 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించేవి. కానీ ప్రస్తుతం పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే హార్ట్‌ ఎటాక్‌లు వస్తున్నాయి.
అప్పటి వరకు ఉషారుగా ఉన్న వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలి పోతున్నారు. కరోనా తదనంతర పరిణామాల నేపథ్యంలో కూడా హృద్రోగాల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృద్రోగ సమస్యలు ఎక్కువవుతున్నాయి. మరీ ముఖ్యంగా శారీరక శ్రమ తగ్గడమే గుండె వ్యాధులకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ గంటలు ఒకేచోట కూర్చొని పనిచేసే వారిలో ఎక్కువ గుండె సమస్యలు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇదిలా ఉంటే హృద్రోగాలకు సంబంధించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక విషయాలను వెల్లడించింది. వ్యాయామం చేయని కారణంగానే భారతీయుల్లో హృద్రోగ సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
సాధారణంగా మనిషీ వారానికి కనీసం 150 నిమిషాలైనా వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే భారతీయుల్లో యాభైశాతానికిపైగా ప్రజలు వ్యాయామం చేయడం లేదంటా. అందుకే భారత్‌లో హృద్రోగ సమస్యలు ఎక్కువని చెబుతున్నారు. 150 నిమిషాలని లెక్కపెట్టు కోలేకపోవడం, రోజుకి 30 నిమిషాలని ప్రత్యేకంగా కేటాయించకపోవడం ఇందుకో కారణమని చెబుతుంటారు వైద్యులు. ఇలాంటి వారు మనం నడిచే అడుగులను కౌంట్ చేసే మొబైల్‌ యాప్స్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు.

ఇక వ్యాయామం నిజంగానే హృద్రోగాలను తగ్గిస్తుంద అన్న అంశంపై అమెరికాలోని ఎంఐటీకి చెందిన పరిశోధకులు పరిశోధనలు చేపట్టారు. భారత్‌ సహా 42 దేశాలకి చెందిన 20 వేల మందికి సంబంధించిన వ్యాయామ వివరాలను పరిశీలించారు. ప్రతీ రోజూ 6 నుంచి 9 వేల అడుగులు నడిచే వాళ్లలో హృద్రోగ సమస్యలు 60 శాతానికి తగ్గినట్లు పరిశోధకులు తేల్చారు. ఇదిలా ఉంటే భారతీయులు ముఖ్యంగా, ఉద్యోగ విరమణ పొందిన వారు శారీరక శ్రమకి దూరమవుతున్నారనీ, అలాంటి వాళ్లు ఇలా అడుగులు లెక్కలేసుకొని నడిస్తే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు.