Iran: హెలికాప్టర్‌ ప్రమాదం.. ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ గల్లంతు

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ గల్లంతైంది. పొరుగుదేశం అజర్‌బైజాన్‌, ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌ సరిహద్దుల్లో ఓ డ్యామ్‌ ప్రారంభోత్సవానికి ఆయన ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ ఆమిర్‌ అబ్దులాహియన్‌, అధికారులు, అంగరక్షకులతో కలిసి హెలికాప్టర్‌లో బయలుదేరారు. కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. మరో రెండు హెలికాప్టర్లు కూడా ఆయన చాపర్‌ వెంట ఉన్నాయి. మధ్యాహ్నానికి తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతాలు, డిజ్మార్‌ అటవీ ప్రాంతాన్ని దాటే క్రమంలో.. జోల్ఫా గ్రామం సమీపంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో జోల్ఫాతోపాటు.. ఉజి, అర్దేషిరి, బారాజిన్‌ గ్రామాలతోపాటు.. డిజ్మార్‌ అటవీ ప్రాంతాల్లో భీకర వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు, దట్టమైన పొగమంచుతో వాతావరణం ప్రతికూలంగా మారింది. మరో 2 హెలికాప్టర్లు గమ్యస్థానానికి చేరుకున్నా.. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ జాడ లేకపోవడంతో.. ఆదివారం సాయంత్రం నుంచి ఇరాన్‌ వ్యాప్తంగా టెన్షన్‌ నెలకొంది. కాసేపటికి తూర్పు అజర్‌బైజాన్‌ గవర్నర్‌ మాలిక్‌ రహ్మతి ‘‘అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోయింది’’ అని ప్రకటించారు. అయితే.. ఇరాన్‌ అధికారిక మీడియా, అధికారులు మాత్రం.. ‘‘రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ జోల్ఫా ప్రాంతంలో హార్డ్‌ ల్యాండింగ్‌ అయ్యింది’’ అని తెలిపారు. అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో విదేశాంగ మంత్రి, పైలట్‌, కోపైలట్‌, అధ్యక్షుడి భద్రతా బృందం అధిపతి, అంగరక్షకులు, అధికారులు ఉన్నట్లు వివరించారు.


ప్రతికూల వాతావరణంలో గాలింపు

హెలికాప్టర్‌ హార్డ్‌ ల్యాండింగ్‌ సమాచారం అందగానే.. సైన్యం, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ), రెడ్‌ క్రెసెంట్‌తోపాటు.. మొత్తం 20 బృందాలు గాలింపు ప్రారంభించాయి. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా గాలింపులో ఆటంకాలు ఏర్పడుతున్నాయని, కొండ ప్రాంతాల్లో మట్టిరోడ్లు చిత్తడిగా మారిపోయి, వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు పేర్కొన్నారు. ‘‘సమాచారం అందిన వెంటనే హెలికాప్టర్ల ద్వారా గాలింపునకు ప్రయత్నించాం. అయితే.. దట్టమైన పొగమంచుతో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పదాతి దళాలు అతికష్టమ్మీద ముందుకు సాగుతున్నాయి’’ అని ఇరాన్‌ ఎమర్జెన్సీ సేవల అధికార ప్రతినిధి బాబక్‌ యెక్తాపరస్ట్‌ మీడియాకు తెలిపారు. కడపటి వార్తలందేసరికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. రైసీ క్షేమంగా తిరిగి రావాలంటూ ఇరాన్‌ వ్యాప్తంగా ప్రజలంతా ప్రార్థనలు చేయాలంటూ అధికారులు ప్రసార మాధ్యమాల ద్వారా కోరుతున్నారు. ఇరాన్‌ మిత్ర దేశాలు కూడా రైసీ క్షేమ సమాచారం కోసం ప్రార్థనలు చేస్తున్నాయి. కాగా.. రైసీ హెలికాప్టర్‌ గల్లంతుపై అమెరికా అఽధ్యక్షుడు జో బైడెన్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు వైట్‌హౌస్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఎప్పటికప్పుడు బైడెన్‌ ఇరాన్‌ అధ్యక్షుడి సమాచారాన్ని ఆరా తీస్తున్నట్లు వివరించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌లో పోస్టు చేశారు. అటు ఇరాన్‌ మద్దతున్న ఉగ్రవాద సంస్థలు– ఇస్లామిక్‌ జిహాద్‌ పొలిటికల్‌ బ్యూరో నేత అలీ అబూ షాహిన్‌, హమాస్‌ సీనియర్‌ సభ్యుడు ఇజ్జత్‌ అల్‌-రె్‌ష్కతోపాటు.. హిజ్బుల్లా, హౌతీ నేతలు కూడా రైసీ క్షేమ సమాచారం కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

కాలం చెల్లిన హెలికాప్టరే కారణమా?

ఇరాన్‌ వద్ద హెలికాప్టర్లన్నీ కాలం చెల్లినవని తెలుస్తోంది. 1979 నాటి ఇస్లామిక్‌ రివల్యూషన్‌ సమయంలో ఉన్న హెలికాప్టర్లే ఇప్పటికీ సైన్యంలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఇరాన్‌ వాటి విడిభాగాలను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితులున్నాయి. ఆదివారం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ కూడా కాలం చెల్లిందే కావడంతో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక ప్రమాదం జరిగి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సుప్రీంలీడర్‌కు నమ్మిన బంటు!

హెలికాప్టర్‌ ప్రమాదంలో గల్లంతైన రైసీ వయస్సు 63 సంవత్సరాలు. ఆయన అధ్యక్ష పదవిని చేపట్టక ముందు న్యాయశాఖకు నేతృత్వం వహించారు. 1988లో ఇరాక్‌-ఇరాన్‌ యుద్ధం సందర్భంగా చిక్కిన ఖైదీలకు సామూహికంగా మరణశిక్ష విధించి, అమలు చేశారు. వీరిలో మైనర్లు కూడా ఉండడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుబడుతూ.. రైసీపై ఆంక్షలు విధించింది. 2015 నుంచి ఇరాన్‌లో అణ్వాయుధాలకు కావాల్సిన యురేనియం(వెపన్‌ గ్రేడ్‌) తయారీలో కీలక పాత్ర పోషించారు. 2017 ఎన్నికల్లో హసన్‌ రౌహానీకి వ్యతిరేకంగా బరిలో ఉన్నా.. ఓటమిపాలయ్యారు. 2021 ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించారు. అయితే.. 2021లో అత్యల్పంగా ఓటింగ్‌ జరిగి, 2.89 కోట్ల మంది పౌరులు మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ ఎన్నికలో రైసీ 62ు ఓట్లను సాధించి, అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. యురేనియం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. హమాస్‌, హౌతీ, హిజ్బుల్లా, ఇస్లామిక్‌ జిహాద్‌ ఉగ్రసంస్థలకు అండదండలను అందజేశారనే ఆరోపణలున్నాయి. హమా్‌సకు మద్దతుగా గత నెల ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడుల్లోనూ రైసీది కీలక పాత్ర అని స్పష్టమవుతోంది.