Andhra Pradesh: రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న ఎస్సైపై సస్పెండ్‌ వేటు

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెలలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తన పోస్టల్‌ బ్యాలట్‌ ఓటును అమ్ముకొని ఓ పోలీసు అధికారి సస్పెండయ్యాడు. బంధువుల ద్వారా ఓ పార్టీకి చెందిన నేత నుంచి డబ్బు తీసుకుంటూ పట్టుబడటంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. దీంతో ఎన్నికల నిబంధనలను ఉల్లంగించినందుకుగానూ సదరు అధికారిని ఐజీ సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకెళ్తే..


గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబు సొంతూరు ప్రకాశం జిల్లా కురిచేడు. మార్చిలో ఎన్నికల బదిలీల్లో భాగంగా మంగళగిరి స్టేషన్‌లో విధుల నిర్వహణకు వచ్చారు. ఎస్సై ఖాజాబాబుకు సొంతూరు కురిచేడులో ఓటు ఉంది. ఖాజాబాబుతో ఓటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5 వేలు పైకం పుచ్చుకొని, ఆ మొత్తాన్ని ఎస్సైకి ఆన్‌లైన్‌లో పంపారు.

అయితే సదరు నాయకుడు డబ్బులు పంపిణీ చేస్తూ ప్రకాశం జిల్లా పోలీసులకు చిక్కాడు. ఆయనను విచారించగా డబ్బులు ఇచ్చిన వారి పేర్లు తెలిపాడు. వారిలో ఎస్సై ఖాజాబాబు డబ్బులను వారి బంధువులకు ఇచ్చినట్లు ఆయన చెప్పాడు. పోలీసులు వారిని విచారించగా నిజమేనని తేలింది. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎస్సైపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీకి నివేదిక పంపారు. ఈ మేరకు ఎస్సై ఖాజాబాబును సస్పెండ్‌ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.