Helpline Numbers : పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ అత్యవసర సమయాల్లో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన హెల్ప్‌లైన్ నెంబర్లను తప్పకుండా తెలుసుకోవాలి.
వీటి ద్వారా అవసరమైన సహాయం తక్షణమే పొందవచ్చు. ఆ ముఖ్యమైన నెంబర్లు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
1091 – మహిళా హెల్ప్‌లైన్: దేశంలో ఎక్కడ ఉన్నా మహిళలు తమకు అవసరమైన సమయంలో ఈ నెంబర్‌కు కాల్ చేస్తే మీకు దగ్గరలోని పోలీసులు వెంటనే స్పందించి రక్షణ కల్పిస్తారు. మహిళల భద్రత కోసం ఇది చాలా ముఖ్యమైన నెంబర్. ప్రతి మహిళా తమ ఫోన్లో తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలి.
112 – పోలీస్ హెల్ప్‌లైన్: ఏదైనా అత్యవసర పరిస్థితిలో పోలీసులను సంప్రదించాలంటే ఈ నెంబర్‌కు డయల్ చేయాలి. ఇది దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. తక్షణ సహాయం కోసం ఉపయోగపడుతుంది.
1098 – బాలికలు, పిల్లల హెల్ప్‌లైన్: అమ్మాయిలు, ఇతర పిల్లలు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు లేదా సహాయం కావాలసినప్పుడు ఈ హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. ఇది వారి రక్షణ, సంక్షేమం కోసం పనిచేస్తుంది.
181 – గృహ హింస హెల్ప్‌లైన్: మహిళలు గృహ హింసకు గురైనప్పుడు సహాయం, రక్షణ కోసం ఈ నెంబర్‌ను సంప్రదించవచ్చు. ఇది గృహ హింసను అరికట్టడానికి, బాధితులకు సపోర్ట్ ఇవ్వడానికి ఉద్దేశించింది.
78271 70170 – జాతీయ మహిళా కమిషన్: మహిళల పట్ల వివక్ష చూపినా లేదా ప్రభుత్వ పథకాలు వారికి అందకుండా చేసినా ఈ నెంబర్‌కు కాల్ చేయవచ్చు. ఇది మహిళల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుంది.
14567 – సీనియర్ సిటిజన్ హెల్ప్‌లైన్: వృద్ధుల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా లేదా వారిని వేధించినా ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు. ఇది వృద్ధుల భద్రత, సంక్షేమం కోసం ఉద్దేశించబడింది.
15100 – ఉచిత న్యాయ సలహా హెల్ప్‌లైన్: న్యాయపరమైన విషయాల్లో ఉచిత సలహాలు, సూచనలు పొందడానికి ఈ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఇది చట్టపరమైన సహాయం అవసరమైన వారికి ఉపయోగపడుతుంది.
139 – రైల్వే హెల్ప్‌లైన్: రైల్వేకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి లేదా ఏదైనా ఫిర్యాదు చేయడానికి ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు. ఇది ప్రయాణికులకు సాయపడుతుంది.
1906 – ఎల్‌పీజీ లీకేజ్ హెల్ప్‌లైన్: ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్ లేదా హెచ్‌పీ గ్యాస్ కనెక్షన్లలో లీకేజ్ సమస్య ఎదురైతే ఈ నెంబర్‌కు వెంటనే డయల్ చేయాలి. ఇది ప్రమాదాలను నివారించడానికి సహాయపడుతుంది.
1930 – సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్: మీరు సైబర్ నేరానికి గురైతే లేదా దాని గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే ఈ నెంబర్‌ను సంప్రదించవచ్చు. ఇది ఆన్‌లైన్ మోసాలు, నేరాలను నిరోధించడానికి పనిచేస్తుంది.
1800-599-0019 – మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్: మానసిక సమస్యలకు సంబంధించి సలహాలు, సమాచారం, చికిత్స పొందడానికి ఈ నెంబర్‌కు ఫోన్ చేయాలి. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది, సహాయం అవసరమైన వారు ఈ నెంబర్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఈ హెల్ప్‌లైన్ నెంబర్లు అత్యవసర పరిస్థితుల్లో మీకు, మీ చుట్టూ ఉన్నవారికి సహాయపడగలవు. కాబట్టి, ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి.