రాష్ట్రంలో ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ సంవత్సరం జరగనున్న పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) ప్రవేశాలకు సంబంధించి వార్షిక ఫీజులను ప్రభుత్వం నిర్ధారించింది.
ప్రభుత్వ కోటా సీట్లుకు సంవత్సరానికి రూ.30 వేలు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లుకు రూ.9 లక్షలు, ఎన్నారై సీట్లుకు రూ.29 లక్షలు ఫీజుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదించారు. 2025-26 సంవత్సరానికి 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నాలుగు కోర్సుల్లో 60 పి.జి ప్రవేశాలకు ఎన్.యమ్.సి (భారత వైద్య మండలి) అనుమతించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాజమండ్రి, నంద్యాల కళాశాలల్లో 16 చొప్పున, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల్లో 12 చొప్పున, ఏలూరు కళాశాలలో 4 పీజీ ప్రవేశాలు జరగనున్నాయి. నాలుగు సబ్జెక్టుల్లో 4 చొప్పున 5 కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్.యమ్.సి వీలు కల్పించింది.
ఎన్.యమ్.సి నియమాల ప్రకారం మొత్తం పీజీ ప్రవేశాలల్లో 50% ఆల్ ఇండియా కోటాకు, మిగిలిన 50% స్టేట్ కోటాకు దక్కుతాయి. 2017లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు స్టేట్ కోటా సీట్లలో 50% కన్వీనర్ కోటా, 35% మేనేజ్మెంట్ కోటా, 15% ఎన్నారై కోటా కింద భర్తీ చేస్తారు. ఒక్కో సబ్జెక్టులో ఎన్.యమ్.సి నాలుగు సీట్లకు అనుమతించినందున ఆయా సబ్జెక్టుల్లో రాష్ట్ర కోటా కింద రెండు సీట్లు లభిస్తాయి. ఈ కారణంగా ఎన్.యమ్.సి కేటాయించిన సీట్లలో ఎన్నారై కోటా కింద ప్రవేశాలకు ఈ విడతలో అవకాశం లభించడం లేదు.
ఫీజు నిర్దారణ వైనం
2023-24 విద్యా సంవత్సరంలో పైన పేర్కొన్న 5 కళాశాలల్లో ఎం.బి.బి.యస్ ప్రవేశాలు జరగగా గత ప్రభుత్వం వాటికి సంబంధించి వార్షిక ఫీజులను నిర్ధారించింది. మొదటి సంవత్సరం ఎం.బి.బి.యస్ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసుకున్న తరువాతనే పి.జి ప్రవేశాలకు అనుమతి లభిస్తుందన్న ఆలోచనతో గత ప్రభుత్వం ఆ 5 కళాశాలల్లో పి.జి సీట్లకు ఫీజుల నిర్ధారణ చేయలేదు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో మొదటి దశలో చేపట్టిన 5 కళాశాలల్లో MBBS సీట్లకు ప్రభుత్వ కోటాలో వార్షిక ఫీజును రూ.15 వేలు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లుకు రూ.12 లక్షలు, ఎన్నారై సీట్లకు రూ.20 లక్షలుగా గత ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సంవత్సరం జరిగే పి.జి ప్రవేశాలకు సంబంధించి ఫీజు నిర్దారణ అంశాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అధికారులతో చర్చించారు. MBBS ఫీజుల నిర్ధారణ కోసం గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై ఆరా తీయగా అందుకు సంబంధించి ఎటువంటి వివరాలు రికార్డుల్లో లేవని వెల్లడైంది. ఆలిండియా కోటా, రాష్ట్ర కోటాలో పి.జి ప్రవేశాలకు వార్షిక ఫీజుకు రూ.30 వేలుగా ప్రతిపాదించారు. గత ప్రభుత్వ విధానానికి భిన్నంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మరియు ఎన్నారై సీట్ల పి.జి ఫీజుల నిర్ధారణకు ఒక తార్కికమైన వైఖరిని అవలంబించాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఎం.బి.బి.యస్ కోర్సుకు సంబంధించి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో చేపట్టబడిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ప్రైవేటు వైద్య కళాశాలలో ఎం.బి.బి.యస్ ఫీజుల నిష్పత్తిని పరిశీలించి అదే రీతిన కొత్త 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పి.జి ఫీజులను నిర్ధారించటం సముచితమని మంత్రి సూచించారు. ఈ మేరకు పి.జి సీట్లకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో వార్షిక ఫీజును రూ.9 లక్షలు గాను, ఎన్నారై కోటా సీట్లుకు రూ.29 లక్షలు గాను మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రతిపాదించగా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
ప్రైవేటు కళాశాలల్లో PG ఫీజుల వివరాలు :
==> కన్వీనర్ కోటా – రూ.4,96,800,
==> మేనేజ్మెంట్ కోటా – రూ.9,93,600,
==> ఎన్నారై కోటా – రూ.57,50,000.




































