చట్టపరమైన వారసుల క్రమం (Order of Legal Heirs)
ఒక హిందువు వీలునామా లేకుండా మరణించినప్పుడు, ఆస్తిని చట్టపరమైన వారసుల మధ్య ఈ కింది విధంగా పంచుతారు.
క్లాస్ I వారసులు
వీరు అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు. ఆస్తిపై మొదటి హక్కు వీరిదే. క్లాస్ I వారసులలో కుమారుడు, కుమార్తె, వితంతువు, తల్లి, కొంతమంది ఇతర ప్రత్యక్ష బంధువులు ఉన్నారు. క్లాస్ I వారసులు ఉంటే మొత్తం ఆస్తి వారి మధ్యనే పంచుతారు.
క్లాస్ II వారసులు
క్లాస్ I వారసులు లేకపోతే, ఆస్తి క్లాస్ II వారసులకు వెళుతుంది. ఈ కేటగిరీలో తండ్రి, సోదరులు, సోదరీమణులు, మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు, ఇతర కుటుంబ సభ్యులు ఉంటారు.
అగ్నేట్స్, కోగ్నేట్స్ (Agnates and Cognates)
క్లాస్ I లేదా క్లాస్ II వారసులు ఇద్దరూ లేకుంటే, ఆస్తి అగ్నేట్స్ (కుటుంబంలో తండ్రి తరఫు బంధువులు) లేదా కోగ్నేట్స్ (తల్లి తరఫున బంధువులు)కు బదిలీ అవుతుంది.
కూతుళ్లకు సమాన హక్కులు?
హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005తో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఈ సవరణ ద్వారా పూర్వీకుల ఆస్తిలో కొడుకులతో సమాన హక్కులు కుమార్తెలకు లభించాయి. చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం, కుమార్తెకు కొడుకుతో సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. దీని అర్థం కుమార్తె పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందవచ్చు. కొడుకులాగే పుట్టుకతోనే ఆ హక్కు కూతురికి కూడా ఉంటుంది.
సక్సెషన్ సర్టిఫికెట్ అవసరమా?
వీలునామా లేనప్పుడు.. చట్టపరమైన వారసులు బ్యాంకు బ్యాలెన్స్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వాటాలు, ఇతర పెట్టుబడులు వంటి ఆస్తులను క్లెయిమ్ చేయడానికి సాధారణంగా సివిల్ కోర్టు నుంచి వారసత్వ ధృవీకరణ పత్రం (Succession Certificate) అవసరం. ఈ సర్టిఫికేట్ చట్టపరమైన వారసులు ఎవరో నిర్ధారిస్తుంది. ఆస్తి చట్టబద్ధంగా వారసులకు చెందినది అయినప్పటికీ, వీలునామా లేకపోవడం ఆస్తుల బదిలీని ఆలస్యం చేస్తుంది. కుటుంబ సభ్యులలో విభేదాలు ఉంటే, కోర్టు కేసుల వరకు వెళ్తుంది. దీనివల్ల మరింత ఆలస్యం, ఒత్తిడి ఎదురవుతాయి.
వీలునామా రాయడం ఎందుకు ముఖ్యం?
మరణం తర్వాత గందరగోళం, ఆస్తి వివాదాలు రాకుండా వీలునామా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి తన ఆస్తిని ఎలా పంచాలో, ఎవరు వారసత్వంగా పొందాలో స్పష్టంగా నిర్ణయించుకోవడానికి వీలునామా అవకాశం కల్పిస్తుంది. ఆస్తిని కుటుంబ సభ్యులకే కాకుండా స్నేహితులకు లేదా స్వచ్ఛంద సంస్థలకు కూడా ఇవ్వవచ్చు. నేడు వీలునామా రాయడం సులభం అయింది. ఆన్‌లైన్ సర్వీసులు చాలా అందుబాటులో ఉన్నాయి. వీలునామా చట్టబద్ధంగా ఉండేలా చూడటానికి ఓ లాయర్‌ని సంప్రదించడం మంచిది.


































