ఇంట్లో ఎంత ‘బంగారం’ దాచుకోవచ్చు.. పెళ్లైన, పెళ్లికాని వారి వద్ద ఎంత ఉండొచ్చు

బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 2025లో భారీగా పెరిగాయి. అదే తీరు 2026లోనూ కొనసాగవచ్చు. అయినప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు.


బంగారం అనేది ఆభరణంగా మాత్రమే కాకుండా ఆర్థిక భరోసా సైతం ఇస్తుంది. సంక్షోభ సమయాల్లో ఆదుకుంటుందని అంతా భావిస్తారు. అదే అసలు నిజం కూడా. బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చెబుతారు. తమ స్థోమతకు తగినట్లుగా బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. అయితే మరి ఇంట్లో బంగారాన్ని చట్టబద్ధంగా ఎంత మేర దాసుకోవచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? పరిమితికి మించి బంగారం దాస్తే ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇంట్లో బంగారం దాచుకునేందుకు కొన్ని నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 132 కింద వ్యక్తులు తమ వద్ద ఉన్న డబ్బులు, బంగారానికి సంబంధించిన ఆదాయ వనరులు చూపించాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో బంగారం ఎంతైనా దాచుకోవచ్చు. కానీ ఈ బంగారం ఏ విధంగా వచ్చింది, చట్టబద్ధంగా కొనుగోలు చేసిందా లేదా వారసత్వంగా వచ్చిందా అని నిరూపించే ఆధారాలు ఉండాలి. ఒకవేళ ఆదాయ వనరులు చూయించలేకపోయినట్లయితే ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు.

గోల్డ్ నిబంధనల ప్రకారం వివాహం అయిన మహిళలు ఇంట్లో 500 గ్రాముల వరకు దాచుకోవచ్చు. పెళ్లికాని యువతులు తమ వద్ద 250 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. ఇక పురుషులు తమ వద్ద 100 గ్రాముల వరకు బంగారాన్ని ఏ పత్రాలు లేకుండా ఇంట్లో దాచుకోవచ్చని ఆదాయపు పన్ను నిబంధనలు చెబుతున్నాయి. ఈ పరిమితి మించి ఎక్కువ బంగారం దాస్తే దానికి సంబంధించిన బిల్లులు, రసీదులు ఉండాలి. లేదా వారసత్వ ఆధారాలు చూపించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి తన తాతగారి నుంచి 1 కిలో బంగారం వారసత్వంగా పొందితే దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి. లేదంటే సమస్యలు వస్తాయి.

ఈ నిబంధనలు 2016లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ జారీ చేసింది. అప్పటి నుంచి, ఆదాయపు పన్ను శాఖ నిర్వహించే దాడుల్లో పరిమితులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. నగదు లేదా బంగారం రూపంలో అక్రమ ఆస్తులు ఉంటే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

బంగారం ఇంట్లో దాచడం కంటే బ్యాంక్ లాకర్లలో ఉంచడం సురక్షితమని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఇంట్లో ఉంటే చోరీ భయం ఉంటుంది. చట్టపరమైన ఇబ్బందులూ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంక్ లాకర్లు లేదా బంగారంపై పెట్టుబడి పెట్టడం మంచి ఎంపికగా సూచిస్తున్నారు. ఇంట్లో బంగారం దాచుకునే వారు తమ ఆదాయ వనరులకు తగ్గట్టుగా, చట్టబద్ధమైన ఆధారాలతో దాచుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.