వేసవికాలం వచ్చిందంటే శరీరానికి చలవ చేసే ఆహారం చాలా అవసరం. అలాంటి సమయంలో పెరుగు అన్నం (Curd Rice) కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి ఉండదు. జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరానికి చల్లదనం ఇవ్వడం, తేలికగా ఉండడం వంటి ఎన్నో లాభాలు పెరుగు అన్నానికి ఉన్నాయి.
అయితే చాలా మందికి ఇంట్లో చేసిన పెరుగు అన్నం కంటే రెస్టారెంట్లలో దొరికే కర్డ్ రైస్ ఎక్కువగా నచ్చుతుంది.
అందుకు కారణం దాని ప్రత్యేకమైన రుచి, మృదుత్వం, అలాగే అందంగా కనిపించే అలంకరణ. అందుకే రెస్టారెంట్ స్టైల్ పెరుగు అన్నం ఇంట్లో చేయడం చాలా ఈజీ అని అంటుంటారు. సరైన పద్ధతిలో పదార్థాలు కలిపితే రుచి కూడా అలాగే వస్తుంది. ఇలా కొన్ని చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే హోటల్ స్టైల్ పెరుగు అన్నాన్ని సులభంగా తయారు చేసి కుటుంబమంతా ఆస్వాదించవచ్చు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్‌గా, కొన్ని ప్రత్యేక టిప్స్‌తో కలిసి పూర్తి రెసిపీ చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
- బియ్యం – అర కప్పు
- నీళ్లు – 300 ml
- పాలు – 125 ml
- పెరుగు – 300 ml (పులుపు లేకుండా ఉండాలి)
- అల్లం – పచ్చిమిర్చి తురుము – 1 టీస్పూన్
- ఉప్పు – రుచికి తగినంత
- ఫ్రెష్ క్రీమ్ – 1 టేబుల్ స్పూన్ (ఐచ్చికం కానీ రుచి పెరుగుతుంది)
- నూనె – 1 టేబుల్ స్పూన్
- ఆవాలు – ½ టీస్పూన్
- జీలకర్ర – ½ టీస్పూన్
- ఇంగువ – చిటికెడు
- ఎండుమిర్చి – 1 లేదా 2
- కరివేపాకు – కొద్దిగా
- జీడిపప్పు – 1 టీస్పూన్
- నెయ్యి – 1 టీస్పూన్
- దానిమ్మ గింజలు – అవసరమైనంత
- కొత్తిమీర తరుగు – కొద్దిగా
తయారీ విధానం..
- ముందుగా బియ్యాన్ని గంటపాటు నానబెట్టాలి. తర్వాత కుక్కర్‌లో నానబెట్టిన బియ్యం, నీళ్లు, పాలు వేసి అన్నాన్ని చాలా మెత్తగా ఉడికించాలి.
- అన్నం కాస్త ముద్దలా అయ్యేలా ఉడికితేనే రెస్టారెంట్ టెక్స్చర్ వస్తుంది. ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి.
- చల్లారిన అన్నాన్ని గరిటతో బాగా చిదిమి, మృదువుగా చేసుకోవాలి. ఇందులో ఉప్పు, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, అల్లం-పచ్చిమిర్చి తురుము వేసి బాగా కలపాలి.
- రుచి ఇంకా మెరుగ్గా రావాలంటే ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచితే బాగుంటుంది.
- ఇప్పుడు తాలింపు కోసం పాన్‌లో నూనె వేడి చేసి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి చక్కగా వేయించాలి.
- ఈ తాలింపును పెరుగు అన్నంలో కలిపితే అద్భుతమైన సువాసన వస్తుంది.
- చివరగా మరో చిన్న పాన్‌లో నెయ్యి వేడి చేసి జీడిపప్పును బంగారు రంగు వచ్చే వరకు వేయించి, పెరుగు అన్నంలో కలపాలి.
- పై నుంచి దానిమ్మ గింజలు, కొత్తిమీర తరుగు చల్లి అలంకరిస్తే… రెస్టారెంట్ స్టైల్ పెరుగు అన్నం రెడీ.
ప్రత్యేక టిప్స్..
పెరుగు పులుపు రాకుండా ఉండాలంటే అన్నం పూర్తిగా చల్లారిన తర్వాతే కలపాలి.
వేసవిలో పెరుగు అన్నం ఎక్కువసేపు బయట ఉంచకండి.
మరింత రుచికోసం కొద్దిగా క్యారెట్ తురుము లేదా ద్రాక్ష పండ్లు కూడా వేసుకోవచ్చు.
ఆరోగ్య పరంగా చూస్తే, ఇది కడుపు చల్లగా ఉంచి గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది.



































